భాజపా దెబ్బకు మహారాష్ట్రలో పెద్దపులి.. గింగిరాలు తిరిగిపోయింది. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నట్లుగా ప్రజల ఎదుట బిల్డప్ ఇచ్చేసి.. శ్రీమతితో కలిసి.. మీడియా ముందు విజయసూచికగా చిరునవ్వులు చిందించేసి.. పండగ చేసుకున్న ఉద్ధవ్ థాక్రే కొన్ని గంటలుగా అసలు ఏం మాట్లాడాలో కూడా తోచకుండా.. చేష్టలుడిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
తమ చేతికి అధికారం దక్కిపోయిందని.. మురిసిపోయిన శివసేన నాయకులు కళ్లమ్మట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరి ఊహలకూ అందకుండా.. భారతీయ జనతా పార్టీ ఆడిన మైండ్ గేమ్, కమల రాజకీయం దెబ్బకు మహా రాజకీయాలు కుదేలైపోయాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం.. శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే కలిసి.. శివసేన ప్రభుత్వం థాక్రే సారథ్యంలో ఏర్పడబోతున్నదని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అర్ధరాత్రి మంత్రాంగం చకచకా నడిచింది. శనివారం తెల్లవారుజామునే.. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఆ వెంటనే ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
శివసేనకు ఖంగు తినిపించిన భాజపా ఎత్తుగడ ఏంటంటే.. ఎన్సీపీ కమలదళంలో చేరింది. ఆ పార్టీ నాయకుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. భాజపా- ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఈ పరిణామాలన్నీ శరద్ పవార్ కు ఏమాత్రం తెలియకుండానే జరిగిపోయాయని ప్రకటించారు!
ప్రభుత్వంలో చేరడం అనేది అజిత్ పవార్ సొంత నిర్ణయంఅని, అది ఎన్సీపీ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదని ప్రకటించారు. శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేలు శనివారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతారని కూడా వెల్లడించారు.
కామెడీ ఏంటంటే.. భారతీయ జనతా పార్టీని గానీ, ఎన్సీపీని గానీ.. విలువలు లేకుండా వ్యవహరించారు.. అనైతికంగా పొత్తులు కలుపుకున్నారు.. అని విమర్శించే అధికారం అటు శివసేనకు, ఇటు కాంగ్రెస్ దక్కకుండా.. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ వరకూ తీసుకెళ్లి.. భాజపా ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం.