‘తల పగ.. తోక చుట్టరికం..’ అని సామెత! అసలు వ్యక్తులు కక్షలతో రగిలిపోతోంటే.. ఏ మాత్రం ప్రాధాన్యం లేని కొసరు వ్యక్తులు ప్రేమగా వ్యవహరిస్తే గనుక… దానిని ఈ సామెతతో ఉదాహరిస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందుకు అచ్చంగా పూర్తి విరుద్ధమైన కాన్సెప్టు కనిపిస్తోంది. వైఎస్పార్ కాంగ్రెస్ పట్ల భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆ తోక పగ.. తల చుట్టరికం అన్న చందంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.. ఢిల్లీ వెళ్లి.. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ లను కలిసి వచ్చారు. వారంతా కూడా చాలా ఆదరంగా రిసీవ్ చేసుకుని.. రాష్ట్ర అవసరాల గురించి జగన్ చెప్పినది, అధికార వికేంద్రీకరణ బిల్లు గురించి, కౌన్సిల్ రద్దు అవసరం గురించి చెప్పినదంతా సావధానంగా విని తెలుసుకున్నారు. వారు స్పందించిన తీరును బట్టి.. మీడియాలో పుకార్లు కూడా వచ్చాయి.
మోడీ సర్కారులోకి జగన్‌ను ఆహ్వానించినట్లు కూడా పుకార్లు వచ్చాయి. అది జరుగుతుందో లేదో తర్వాతి సంగతి. కానీ జగన్ పట్ల ఆదరంగా స్పందించారన్నది మాత్రం నిజం. కానీ.. భాజపా ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దేవధర్ మాత్రం విషం కక్కుతున్నారు. జగన్ వైఖరి వల్ల కంపెనీలు వెనక్కు పోతున్నాయని, రాష్ట్ర ప్రజల్ని జగన్ మోసం చేస్తున్నారని, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని పలు మాటలు అంటున్నారు.
మూడు రాజధానుల గురించి కేంద్రం అనుమతి తీసుకున్నారా? అలా తీసుకుని ఉంటే.. అలా ప్రచారం చేస్తున్న వాళ్లు ఆ కాగితాలు చూపించాలి.. అంటూ మాట్లాడుతున్న దేవధర్ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రాజధాని అనేది రాష్ట్రప్రభుత్వం పరిధిలో ఉండే అంశం. కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం, అగత్యం రాష్ట్రానికి లేదు. అడ్డుకోవడం కేంద్రం తరం కాదు. కాకపోతే.. కౌన్సిల్ రద్దు.. హైకోర్టు ప్రధాన బెంచ్ ను కర్నూలుకు తరలించడం మాత్రం కేంద్రం కూడా ఆమోదించాల్సి ఉంటుంది.
కనీస పరిజ్ఞానం లేకుండా.. ఏదో ఏపీలో మాట్లాడుతున్నాడు గనుక.. జగన్ మీద ఎడాపెడా బురద చల్లేయవచ్చునని దేవధర్ అనుకుంటే.. ఆయనకు ఒరిగేదేమీ ఉండదు. జగన్ కు విశాఖ మీద నిజంగా ప్రేమ ఉందా..? నిజంగా అభివృద్ధి చేస్తారా అంటూ ఎద్దేవా చేస్తున్న దేవధర్, కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి, ఏపీపై ప్రేమ ఉంటే గనుక.. ముందు ప్రత్యేకహోదా ఇచ్చి తర్వాత మాట్లాడాలని ప్రజలు అంటున్నారు.