పందెం జాడ్యం రాయలసీమను కూడా అంటుకుంది. పందెం, జూదం సంస్కృతి తక్కువగా ఉండే ప్రాంతం ఇది. అయితే ఈ మధ్యకాలంలో వేరే ప్రాంతాల నుంచి ఈ జాడ్యం అంటుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల వేళ కూడా బెట్టింగుల జోరు ఊపందుకుంటోంది. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశం గురించి, నియోజకవర్గాల వారీగా కూడా ఇక్కడ బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. ఈ పందెం ఊపు ఇరువర్గాల నుంచి కూడా కనిపిస్తోంది. ఈ ఏ పార్టీ అభిమానులు వారి పార్టీనే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేస్తూ ఉన్నారు. తటస్థులు మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం మీద ఎక్కువగా బెట్స్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాయలసీమలో.
ఇలాంటి పందేలకు క్రేజీగా కనిపిస్తున్న నియోజకవర్గం జమ్మలమడుగు. అత్యంత హోరాహోరీ పోరుసాగిన ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే అంశం గురించి పందెంరాయళ్లు గట్టిగానే డబ్బులు కడుతూ ఉండటం విశేషం. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా మెలిగిన ఆదినారాయణ రెడ్డి- రామసుబ్బారెడ్డిలు ఈసారి చేతులు కలిపారు. తెలుగుదేశం పార్టీ తరఫున వారు పనిచేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయం కోసం హోరాహోరీగా తలపడ్డారు. ఎవరి ప్రచారం వారు చేశారు. ఎవరి అస్త్రాలు వారు సంధించారు. పోలింగ్ పక్రియ పూర్తి అయ్యింది.
ఇలాంటి నేపథ్యంలో విజయం విషయంలో ఏవర్గం ధీమా వారిది. అయితే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం మీద బెట్ కాస్తున్నారు పందెంరాయుళ్లు. అది కూడా మెజారిటీ విషయంలో కావడం విశేషం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి కనీసం నాలుగు వేలకు పైస్థాయి మెజారిటీ వస్తుందనేది ఒక బెట్టింగ్ ట్రెండ్. వస్తుందని కొంతమంది కాస్తుంటే, రాదని మరికొందరు బెట్స్ వేస్తున్నారు.
అలాగే సుధీర్ రెడ్డికి పదివేలకు పైగా మెజారిటీ వస్తుంది అనే అంశం మీద కూడా బెట్టింగ్ నడుస్తూ ఉండటం విశేషం. ఒక్క యర్రగుంట్ల మండలంలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి ఎనిమిది వేలకు పైగా మెజారిటీ వస్తుందనే అంశం మీద కూడా బెట్టింగ్ సాగిస్తూ ఉన్నారు!