స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులోగా పూర్తి అయిపోనున్నాయి. లేకపోతే కేంద్రంనుంచి విడుదలయ్యే నిధులు మురిగిపోతాయి. మూడువేలకోట్లకు పైగా నిధులు వృథా అవుతాయి. అందుకే జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే.. తదనుగుణంగా వెంటవెంటనే నిర్ణయాలు తీసేసుకుంది. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మురిగిపోకుండా ఉండాలంటే.. ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తికావాల్సి ఉన్న నేపథ్యంలో.. హైకోర్టు తీర్పును సవాలు చేసే ఉద్దేశ్యాలను రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లుగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం పెంచదలచుకున్న సదాశయంతో.. జగన్మోహన రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పద్ధతిని మార్చారు. బీసీ రిజర్వేషన్లు పెంచారు. మొత్తం ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలన్నింటికీ కలిపి ఏర్పాటుచేస్తున్న రిజర్వేషన్లు 59.85 శాతానికి వెళ్లాయి. ఇది రిజర్వేషన్ల విషయంలో.. అన్నీ కలిపి యాభై శాతానికి మించకూడదన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకం అంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
హైకోర్టు విచారణ తర్వాత.. ఎట్టకేలకు సోమవారం తీర్పు వచ్చింది. కొత్తగా పెంచిన రిజర్వేషన్లను కోర్టు కొట్టేసింది. సాధారణ పరిస్థితుల్లో అయితే.. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో వెనుకబడిన వర్గాలకు అదనపు ప్రయోజనం కల్పించడానికి తాము ఉద్దేశించిన కొత్త రిజర్వేషన్ వ్యవస్థ మీద జగన్ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం అంత సమయంలేదు.
ఈ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నందున తక్షణమే రంగంలోకి దిగిపోయారు. ప్లాన్ బీ గా ఇదివరకే చాలా జిల్లాల్లో కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే గనుక.. యాభై శాతం మించకుండా రిజర్వేషన్లను ఎలా విభజించుకోవాలో ప్లాన్ చేసుకుని ఉన్నట్లుగా తెలుస్తోంది. దాని పర్యవసానంగా.. కోర్టు తీర్పు తర్వాత వెంటనే కార్యచరణలోకి దిగేశారు. నిజానికి హైకోర్టు రిజర్వేషన్ల తాజా ఏర్పాటును నివేదించడానికి నెలరోజుల సమయం ఇచ్చింది గానీ.. నెలాఖరులోగా మొత్తం పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం వీలైనంత వేగంగా మొత్తం నడిపించనున్నట్లు తెలుస్తోంది.