తెలుగుదేశం నాయకులు తమ గోతిని తామే తవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తమ చేతగానితనాన్ని, తమ అరాచకత్వాన్ని తామే బయటపెట్టుకుంటున్న ధోరణిలో వారు వ్యవహరిస్తున్నారు. ఏదో తమకు అన్యాయం జరిగిపోతున్నట్లుగా నాలుగు మాటలు వండి వారిస్తే ప్రజల సానుభూతి వస్తుందని వారు భ్రమిస్తున్నారో ఏమో తెలియదు గానీ.. అంతకంతకూ ప్రజలు తమను ఛీత్కరించుకునే పరిస్థితిని వారే కల్పిస్తున్నారనే సంగతి వారికి అర్థంకావడం లేదు.
అక్రమ కట్టడం అనే ముద్ర వేసి ప్రజావేదిక నిర్మాణాన్ని కూల్చివేయడానికి సీఎం జగన్ ఆదేశాలు కూడా ఇచ్చేశారు. తెలుగుదేశం నాయకులు కుక్కిన పేనుల్లా నోరు మెదపకుండా అక్కడితో సైలెంట్ గా ఉండిఉంటే సరిపోయేది. కానీ అదే పనిగా గొంతుచించుకుని అరుస్తున్నారు. ఆ భవనం కూల్చివేయడానికి వైకాపా ప్రభుత్వం చూపిస్తున్న కారణాల్లో ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పకుండా.. ప్రభుత్వం ఏదో అన్యాయం చేసేస్తున్నదన్నట్లుగా తెదేపా నాయకులు మాట్లాడడం చాలా చీప్‌గా ఉంది.
తెదేపా వారి మాటలు పరిశీలిస్తే.. అది అక్రమ కట్టడం అని తెలిస్తే అందులో కలెక్టర్ల సమావేశం ఎందుకు పెట్టారు? అని మాట్లాడుతున్నారు? ఎంత ఘోరంగా ఉందీ మాట! ఇది అక్రమ కట్టడమనే సంగతి అందరికీ చెప్పడానికే అక్కడ మీటింగ్ పెడుతున్నట్లుగా జగన్ స్పష్టంగా పేర్కొన్నారు. అయినా వారికి అర్థంకావడం లేదు. అలాగే, చంద్రబాబునాయుడు లేఖ రాశాడు గనుక… ఆయనకు ఇచ్చేయాల్సి వస్తుంది గనుక కూల్చేస్తున్నారు.. అనేది తెదేపా వారు చేస్తున్న మరో మూర్ఖమైన వాదన.
చంద్రబాబు లేఖ రాసినంత మాత్రాన ఆయనకు ఇచ్చేయాలని రూలేమైనా ఉందా? అది ఆయన జాగీరు కాదు కదా! ప్రజల నుంచి వినతులు తీసుకోవడానికి ప్రతిపక్ష నేతకు సదరు 9 కోట్ల రూపాయల భవంతి కావాలట! ఈ మాట వింటేనే వారి వాదన ఎంత కామెడీగా ఉందో అర్థమవుతుంది.
అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నీ పాలనే మాకొద్దు బాబూ అని ఛీత్కరించి పంపేశారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షనేత హోదాలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారట. ఆయన పాలన సాగించినప్పుడు.. జగన్ ఇలాంటి వినతులు స్వీకరించడానికి ఏం భవంతిని కేటాయించారు. ఇలాంటి పసలేని వాదనలతో తెలుగుదేశం నాయకులు తమ పరువు తామే తీసుకుంటున్నారనే విషయం తెలుసుకోవాలి.