ఏపీలో తామున్నామని చెప్పుకునే ప్రతి పార్టీతోనూ పొత్తుకు తెలుగుదేశం పార్టీ ఆరాటపడుతూ ఉందా? కుడి, ఎడమ తేడా లేకుండా అందరితోనూ జత కట్టడానికి చంద్రబాబు ఇప్పటికే చూపుతున్న ఆరాటం, జనసేనపై తనది వన్ సైడ్ లవ్వు అయ్యిందని ఆయన గతంలో వాపోయిన వైనం.. ఇదంతా చూసి సొంతంగా గెలిచే సత్తా ఏ కోశానా లేక చంద్రబాబు ఈ తరహాలో వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి.
వచ్చే ఎన్నికల్లో వీలైతే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ, జనసేన.. ఈ పార్టీలన్నింటితోనూ కలిపి పొత్తు పెట్టుకోవాలన్నట్టుగా ఉంది చంద్రబాబు వ్యవహారం. ఇంకా దళిత ఓట్లు పడతాయనుకుంటే బీఎస్పీకి కూడా ఒకటీ అర సీటును కేటాయించడానికి చంద్రబాబు వెనుకాడకపోవచ్చు! పొత్తు అంటే చాలు.. భారతీయ జనతా పార్టీకి కనీసం పది ఎంపీ సీట్లు, జనసేనకు ముప్పై వరకూ ఎమ్మెల్యే సీట్లు, కమ్యూనిస్టులకు ఐదారు సీట్లు, కలిసొస్తే కాంగ్రెస్ కు ఒకటీ రెండు, బీఎస్పీ కి ఒకటి.. ఇలా చంద్రబాబు అందరినీ కలుపుకుని పోవడానికి వెనుకాడకపోవచ్చు.
ఎర్ర పార్టీలనూ, కాషాయ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఒకే కూటమిగా కలిపేందుకు చంద్రబాబు వెనుకాడరు! ఇలాంటి రాజకీయ ప్రయోగం చేసి అయినా అధికారాన్ని దక్కించుకోవాలనే ఎత్తుగడలు చంద్రబాబుకు ఉన్నాయంటే పెద్ద ఆశ్చర్యమూ లేదు! ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది.
ఇక మరోవైపు ఇంతలో ఏపీలో బీఆర్ఎస్ హాజరు పలికించుకుంటోంది. దీంతో బీఆర్ఎస్ ను కూడా చంద్రబాబు కలుపుకుపోవచ్చనే టాక్ మొదలైందంటే ఆశ్చర్యం కలగకమానదు. అసలు ఏపీలో బీఆర్ఎస్ ఉనికి ఏమిటో ఎవరికి తెలియదు. రాజకీయంగా ఏ మాత్రం సత్తా చూపించలేని ఒకరిద్దరు నేతలను చేర్చుకుంది బీఆర్ఎస్. ఇంతలోనే చంద్రబాబు పొత్తు ఎత్తుల్లోకి బీఆర్ఎస్ వచ్చి చేరిందట. ఏపీలో బీఆర్ఎస్ కు బలం లేకపోయినా.. తెలంగాణలో సహకరించడానికి సై అంటూ చంద్రబాబు కేసీఆర్ పార్టీని దువ్వవచ్చు!
చంద్రబాబు రాజకీయంలో ఇది జరగదు అని ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి.. తెలంగాణలో కేసీఆర్ ప్రాపకం కోసం బీఆర్ఎస్ తో జట్టు అని ప్రకటించి, ఆ పార్టీకీ ఒకటీ రెండు సీట్లను కేటాయించే రాజకీయ వ్యూహాన్ని చంద్రబాబు ఫాలో అయినా ఆశ్చర్యం లేదు! సొంతంగా గెలవలేక.. పొత్తుల కోసం చంద్రబాబు పడుతున్న పాట్లు ఇలా ఉన్నట్టున్నాయి.