కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం గట్టి పోటీనే నెలకొన్నట్టుగా సమాచారం. ఎమ్మెల్యేలుగా నెగ్గుకురాలేకపోయిన నేతలు జిల్లా అధ్యక్ష పీఠం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ పోటాపోటీ పరిస్థితుల్లో వ్యూహం కూడా ఉందని సమాచారం. తమకు ఆ పదవి దక్కితే తెలుగుదేశం పార్టీలో ఉండటం, లేదంటే ఆ పార్టీకి దూరం కావడం అనే వ్యూహంతో నేతలు ముందుకు వెళ్తున్నారనే టాక్ కూడా వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ విషయంలో రెండు రాజకీయ కుటుంబాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. వాటిలో ఒకటి భూమా కుటుంబం కాగా, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్న మరో రాజకీయ కుటుంబం గౌరు. గౌరు దంపతులు.. తామిద్దరిలో ఎవరో ఒకరికి జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం దక్కాల్సిందే అంటున్నారట. ఇక తమను కాదని వేరేకొరిని ఆ హోదాలో నియమిస్తే సహించేది లేదని భూమా కుటుంబం తేల్చి చెబుతున్నట్టుగా భోగట్టా.
భూమా కుటుంబంలో జిల్లా అధ్యక్ష పదవి చేపట్టాలంటే.. ఇప్పటికే కనీసం మాజీ ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి అయిన అఖిలప్రియకే ఆ పదవి దక్కాలి. జిల్లా అధ్యక్ష పదవి తను చేపట్టి నియోజకవర్గాన్ని తమ తమ్ముడికి అప్పగించాలని భావిస్తున్నారట అఖిలప్రియ. అయితే ఇప్పటికే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే అఖిలప్రియపై అనేక మంది నేతలు అసంతృప్తులుగా మారారు. నంద్యాల బై పోల్ సమయంలో ఎంతో మంది నేతలు టీడీపీ విజయం కోసం పని చేయగా.. వాళ్లలో ఇప్పుడు చాలా మంది టీడీపీకి దూరం కావడం లేదా అఖిలప్రి వైఖరిపై వ్యతిరేకతతో ఉండటం జరుగుతోంది. ఈ క్రమంలో అఖిలప్రియకు జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందా? అనేది సందేహాస్పదమైన అంశమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
అఖిలప్రియ వంటి జూనియర్ ను జిల్లా అధ్యక్ష పదవిలో కూర్చోబెడితే, టీడీపీలో ఇంకా మిగిలే ఉన్న కొంతమంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఇక గౌరు దంపతులు మాత్రం గట్టిగానే తమ ప్రయత్నాలను సాగిస్తున్నారట. వీళ్లు ఎన్నికల ముందు మాత్రమే తెలుగుదేశం పార్టీలో చేరారు. తమ బంధువుకు నంద్యాల ఎంపీ టికెట్, చరితకు ఎమ్మెల్యే టికెట్ హామీతో వీరు టీడీపీ వైపు వెళ్లారు. అటు నంద్యాల ఎంపీ సీట్లో వీళ్ల బంధువు ఓడిపోయాడు, వీళ్లూ నెగ్గుకు రాలేకపోయారు. ఈ పాటికే వీళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూడాల్సింది. అయితే చేజేతులారా ఆ పార్టీకి దూరం అయిన వీళ్లు అటు వైపు చూడటానికి ఎంతో కొంత సంకోచిస్తున్నట్టుగా ఉన్నారు. వీరు కీలక సమయంలో చేసిన పనితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా వీళ్లను ప్రత్యేకించి ఆహ్వానించే అవకాశాలు లేనట్టే. అందుకే తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్ష బాధ్యతల విషయంలో వీళ్లు గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా భోగట్టా.
ఇటీవల హైదరాబాద్ నుంచి హైవే మీద అనంతపురం వెళ్తున్న నారా లోకేష్ ను మార్గమధ్యంలో కలిసిన వారిలో గౌరు దంపతులు కూడా ఉన్నారు. అధ్యక్ష బాధ్యతల కోసం వీరు ఈ ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారని భోగట్టా. ఇక కర్నూలు జిల్లాలో జీరోగా మిగిలిన తెలుగుదేశం పార్టీ తరఫున చాలా మంది నేతలు ఇన్ యాక్టివ్ అయ్యారు. ఎంపీగా పోటీ చేసిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులు వంటి వారు కూడా టీడీపీ తరఫున యాక్టివ్ గా కనిపించడం లేదు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవి విషయంలో మరీ పోటీ లేనట్టే. ఉన్న పోటీ గౌరు, భూమా కుటుంబాల మధ్యనే కనిపిస్తూ ఉంది. అయితే వాళ్లు కూడా పార్టీ ని వీడటానికి ఒక సాకుగా పోటీపడుతున్నారని, దక్కితే ఓకే, దక్కకపోతే టీడీపీకి రాజీనామా అంటూ తప్పుకోవడానికి వీలవుతుందనే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారనేది కర్నూలు జిల్లా రాజకీయ పరిశీలకుల అభిప్రాయం!