తమకు చెప్పుకోవడానికి కూడా గట్టిగా బలం లేని శాసనసభలో ఒకలా, సభ్యుల బలమున్న శాసనమండలిలో మరోలా! ఇదీ తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వ్యూహం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తనదైన ద్వంద్వ వైఖరిని అనుసరిస్తూ ఉంది. ఈ విషయంలో అధికార పార్టీ, ఇతర పార్టీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.
అసలు కథ ఏమిటంటే.. గవర్నర్ ప్రసంగం సమయంలోనే తెలుగుదేశం పార్టీ రొటీన్ రచ్చ స్టార్ట్ చేసింది. తమ పార్టీ నేతలను అక్రమ అరెస్టులు చేశారని అంటూ నినాదాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు హడావుడి చేసి, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సభా సమావేశాలు అలా ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసి పలాయనం చిత్తగించింది.
కట్ చేస్తే.. మండలిలో మాత్రం అలాంటి సీన్ లేదు. మండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు చర్చలో పాల్గొంటారట. ఈ మేరకు ఆ పార్టీ తీర్మానం చేసిందని తెలుస్తోంది. ఈ వ్యవహారం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది.
గవర్నర్ ప్రసంగం సందర్భంగానే అసెంబ్లీని వాకౌట్ చేసి, మండలిలో మాత్రం చర్చలో పాల్గొనడం ఏమిటని అంతా అనుకుంటున్నారు. వాకౌట్ విషయంలో తెలుగుదేశం పార్టీకి సమన్వయం లోపించిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇక్కడ తెలుగుదేశం డ్రామా స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. అసెంబ్లీలో ఎలాగూ బలం లేదు. ఆ 23 మందిలో కూడా ఎంత మంది చంద్రబాబు చెప్పినట్టుగా వింటారో తెలియదు! అదే మండలిలో అయితే.. ప్రభుత్వం తెచ్చే బిల్లులను సంఖ్యాబలంతో అడ్డుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే..అసెంబ్లీ నుంచి పరార్ అయ్యి, మండలిలో మాత్రం తెలుగుదేశం పార్టీ చర్చల్లో పాల్గొనడానికి అనుకూలంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఎంతైనా తెలుగుదేశం పార్టీది ఏ అంశంలో అయినా రెండు కళ్ల సిద్ధాంతమే అనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు మరోసారి అదే రుజువవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.