పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలిచింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత… రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా వీలైనంత వ్యయం తగ్గించేలా ప్లాన్ చేసి మరీ టెండర్లను ఆహ్వానించారు. రీటెండర్ల వలన పోలవరం పనులు ఆలస్యం అవుతాయని, పనుల నాణ్యత, స్థిరత్వం కూడా ప్రశ్నార్థకం అవుతుందని కొందరు సంశయాలు వెలిబుచ్చినప్పటికీ.. ప్రభుత్వం అవినీతిని అరికట్టడం లక్ష్యంగా ముందుకువెళ్లింది. కాంట్రాక్టు రద్దయిన సంస్థ నవయుగ కోర్టులో దావాలు వేసినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఇంతాచేస్తే.. ఇప్పుడు రీటెండర్లు కూడా రద్దయి.. మళ్లీ టెండర్లు పిలవక తప్పదేమో అనే సందేహాలు పలువురికి కలుగుతున్నాయి.
పోలవరం రీటెండర్లకు కేవలం ఒకే ఒక్క సంస్థ మేఘా వారు బిడ్ దాఖలు చేశారు. రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియకే అవకాశం లేకుండా పోయింది. ఇక ప్రభుత్వం మీద పడగల భారాన్ని తగ్గించే అవకాశం ఎలా వస్తుంది? జగన్ ప్రభుత్వం అంచనాలు అన్నీ తల్లకిందులు అయ్యాయి. ఒకే ఒక్క సంస్థ పోటీలో నిలవడంతో.. ఇప్పుడు వేరే గత్యంతరం లేక వారికే పనులు అప్పజెప్పేయడమా..? లేదా, మరింత పారదర్శకత కోసం మరోసారి టెండర్లు పిలవడమా? అనేది ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా మారింది.
గతంలో పోలవరం ప్రధాన డ్యామ్, హైడల్ ప్రాజెక్టు పనులు రెండింటికీ నవయుగ సంస్థ విడివిడిగా కాంట్రాక్టులు పొంది ఉన్నది. వాటిని రద్దుచేసి ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలిచింది. దానిపై ఆ సంస్థ కోర్టులో దావాలు కూడా వేసింది. అవి విచారణలో ఉండగానే.. కాంట్రాక్టుల రద్దుపై కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుని, రీటెండర్లకు మార్గం సుగమం చేశారు. రెండింటికీ కలిపి సుమారు ఐదువేల కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచారు. ఈ టెండరులో పాల్గొనడానికి 8 సంస్థలు ఉత్సాహం చూపాయి.
రివర్స్ టెండరింగ్ ద్వారా.. ఎడమ కాలువ పనుల్లో 58 కోట్లు మిగిలిన నేపథ్యంలో.. 5వేల కోట్లరూపాయల పనుల్లో వందల కోట్ల మిగులు ఉంటుందని అంతా ఊహించారు. అయితే గడువు ముగిసే సమయానికి ఒక్క మేఘా సంస్థ మాత్రమే తమ బిడ్ దాఖలు చేసింది. వారు ఎంత మొత్తానికి కోట్ చేసారనే సంగతి 23న ఫైనాన్షియల్ బిడ్ తెరచిన తర్వాత తెలుస్తుంది. అయితే రివర్స్ టెండర్లో పాల్గొనడానికి గానీ.. రేటు తగ్గడానికి గానీ మరో సంస్థ లేకపోవడం గమనార్హం.
గతంలో ఇసుక టెండర్ల విషయంలో పలుజిల్లాల్లో ఒకే టెండరు దాఖలైనప్పుడు.. ప్రభుత్వం నిర్మొహమాటంగా వాటిని రద్దుచేసి మళ్లీ టెండర్లు పిలిచింది. తద్వారా కాంట్రాక్టర్లకు ఏకపక్షంగా దోచిపెట్టే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పినట్లయింది. ఇప్పుడు కూడా అదే విలువలను పాటిస్తే గనుక.. కేవలం ఒకే కంట్రాక్టరు పాల్గొన్నందుకు ఈ టెండరును రద్దుచేసే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. ఫైనాన్షియల్ బిడ్ కూడా తెరచిన తర్వాత.. ఈ టెండరు రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.