Advertisement

Advertisement


Home > Politics - Gossip

కోర్టులో దొంగతనం.. కాకాణి వ్యతిరేక వర్గం పనేనా?

కోర్టులో దొంగతనం.. కాకాణి వ్యతిరేక వర్గం పనేనా?

నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగింది. మంత్రి కాకాణి ముద్దాయిగా ఉన్న కేసులో సాక్ష్యాలు మాయం అయ్యాయని తెలుస్తోంది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. మంత్రి పదవి చేపట్టి సరిగ్గా కాకాణి నెల్లూరుకి వచ్చే టైమ్ లో ఇదంతా జరుగుతోంది. 

అసలు కాకాణి ఈ టైమ్ లో ఇలాంటి తప్పు చేస్తారా..? పోనీ సాక్ష్యాలు ఎత్తుకెళ్లేందుకు వెళ్లినవారు సగం పేపర్లను అక్కడే పడేసి వస్తారా..? అనుమానం కలగడానికే అలా చేశారా..? కాకాణి ఇమేజ్ ని డ్యామేజీ చేయడానికే ఇదంతా చేస్తున్నారా..? కాకాణి వ్యతిరేక వర్గం ఆడుతున్న డ్రామానా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

దొంగలు అంత తెలివి తక్కువ వాళ్లా..?

గతంలో సోమిరెడ్డికి విదేశాల్లో అక్రమ ఆస్తులున్నాయంటూ కాకాణి మీడియా ముందు కొన్ని పత్రాలను చూపించారు. అయితే ఆ పత్రాల విశ్వసనీయత ఎంత అనేది తేల్చుకోకపోవడం, తన దగ్గరకు వచ్చినవారిని గుడ్డిగా నమ్మి మీడియా ముందుకు రావడం ఆయన చేసిన తప్పు. దీంతో సోమిరెడ్డి పరువునష్టం దావా వేశారు, దానిపై కాకాణి విచారణ ఎదుర్కొంటున్నారు.

అయితే మంత్రి పదవి వచ్చిన తర్వాత కాకాణికి శిక్ష పడుతుందనే ఉద్దేశంతోనే ఆయన సాక్ష్యాలు మాయం చేశారనేది ఇప్పుడు టీడీపీ చేస్తున్న వాదన. పోనీ సాక్ష్యాలను దొంగలు పూర్తిగా ఎత్తుకెళ్లారా అంటే అదీ లేదు. అసలు ఏ కేసుకి సంబంధించి సాక్ష్యాలు మాయమయ్యాయో ఈజీగా తెలిసేటట్టు.. కొన్ని పేపర్లను కోర్టు బయట పడేసి వెళ్లారు. అందులో ఓ పాస్ పోర్ట్ కూడా ఉంది, దాని ఆధారంగానే అది ఫలానా కేసులో సాక్ష్యం అని బయటకు పొక్కింది. మరీ ఇంత తెలివ తక్కువ పని చేశారంటే.. కచ్చితంగా దీని వెనక కుట్ర ఉంటుందని అనుమానిస్తున్నారు కాకాణి అభిమానులు.

సోమిరెడ్డి హై డ్రామా..?

సోమిరెడ్డికి, నెల్లూరు వైసీపీకి చెందిన ఓ కీలక నేతతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే విషయం తెలిసిందే. గతంలో సోమశిల ప్రాజెక్ట్ నిర్వహణ సరిగా లేదనే ఆరోపణలు వచ్చినా సోమిరెడ్డి నోరు మెదపకపోవడానికి కారణం అదే. సోమిరెడ్డి, జగన్ పై రెచ్చిపోతున్నా.. ఆ నేత మాత్రం ఆయన్ను మినహా మిగతా అందరికీ చాకిరేవు పెడతారు. ఈ లోపాయికారీ ఒప్పందాలు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి.

నెల్లూరు వైసీపీలో ఇటీవల లుకలుకలు మొదలైనా.. సోమిరెడ్డి పల్లెత్తు మాట అనలేదు, తనదైన శైలిలో సెటైర్లు పేల్చలేదు. సరిగ్గా కోర్టు దొంగతనం వ్యవహారం బయటపడ్డాక లైన్లోకి వచ్చారు. కాకాణే దొంగతనం చేయించారంటూ ఆరోపిస్తున్నారు.

నిజం నిలకడ మీద తెలుస్తుంది. కాకాణికి మంత్రి పదవి రావడంతో ఓర్చుకోలేక వైరి వర్గం ఇలా ప్లాన్ వేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమయినా కోర్టులో దొంగతనం అనేది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఘటన. స్థానిక పోలీసులు దీన్ని ఎంత త్వరగా ఛేదిస్తారు, దొంగల వెనక ఎవరున్నారనేది మాత్రం ఆసక్తికరం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?