నాయకుల మాటల్ని కాస్త వంకరగా తిప్పి, వాటికి వేరే యాంగిల్ లో భాష్యం చెప్పగలిగితే.. వారి మీద బురద పులమడం సాధ్యమవుతుందని రాజకీయ ప్రత్యర్థులు నమ్ముతూ ఉంటారు. నాయకుల మాటలను కాంటెక్ట్సుతో నిమిత్తం లేకుండా… తమకు ఇష్టం వచ్చినట్లుగా ఇంటర్ ప్రిటేట్ చేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. సభలో కశ్మీర్ విభజన బిల్లుమీద చర్చ సందర్భంగా, కాంగ్రెస్ నాయకుల విమర్శలకు కౌంటర్ ఇస్తూ, ఏపీ విభజన బిల్లు సమయంలో మీరు ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి అన్నమాటలనే మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ… ఆ బిల్లుపై ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నదంటూ సభలో విమర్శించింది. కశ్మీర్ కు చెందిన ఇద్దరు ఎంపీలను అప్పటికే సభలోంచి మార్షల్స్ ద్వారా వెలుపలికి పంపారు. కాంగ్రెస్ నిరసనలు వ్యక్తంచేస్తున్నా సరే.. బిల్లును ప్రవేశపెట్టారు. ఈ పోకడను కాంగ్రెస్ విమర్శించింది. అమిత్ షా తెలంగాణ బిల్లు నాటి పరిస్థితులను గుర్తుకుతెస్తూ కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది.
ఇప్పుడు ఆ మాటలను పట్టుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణలో రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ మాటలు అనడం ద్వారా అమిత్ షా, తెలంగాణ ప్రజలను అవమానించారని అంటున్నారు. తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా జరగలేదని అమిత్ షా అన్నట్లుగా ఉత్తమ్ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు ఉన్న స్థానాన్ని కమలదళం చేజిక్కించుకుంటుదేమోననే భయం వారిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ సమయంలో భాజపాపై అనుమానాల్ని పాదుగొల్పాలని కాంగ్రెస్ తపన పడుతున్నట్లుగా ఉంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ.. ఆరోజుల్లో కూడా చిన్న రాష్ట్రాలకు పూర్తి అనుకూలంగా ఉన్న భాజపా.. దానికి సహకరించింది. ఏపీకి ప్రత్యేకహోదా వంటి కొన్ని మార్పులను మాత్రమే కోరుతూ బిల్లు ఆమోదం పొందడానికి తోడ్పడింది.
ఆ మాట కొస్తే.. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత.. సదరు ప్రత్యేకహోదా అనే డిమాండును కూడా తుంగలో తొక్కేసింది. అలాంటిది ఇప్పుడు భాజపాపై తెలంగాణ వ్యతిరేక ముద్ర వేయడానికి, తెలంగాణను అవమానిస్తున్నారంటూ భాష్యం చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నించడం నిష్ఫలమే అవుతుంది.