పీఠంపై పులి :: పలుపు పవార్, అమ్మకేనా?

మహాపీఠంపై పులి కూర్చోనుంది. శివసేన సీఎం పదవిని అధిష్టించేలా.. పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడానికి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ సోనియాతో పవార్ సమావేశంలో నిర్ణయానికి తుదిరూపు వస్తుంది. Advertisement…

మహాపీఠంపై పులి కూర్చోనుంది. శివసేన సీఎం పదవిని అధిష్టించేలా.. పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడానికి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ సోనియాతో పవార్ సమావేశంలో నిర్ణయానికి తుదిరూపు వస్తుంది.

సింహాసనాన్ని పులి అధిష్టించవచ్చు గాక.. కానీ దానికి స్వేచ్ఛ ఉంటుందా…? పాకలో పశువల్ని కట్టేసినట్టుగా.. దాని మెడలో ఒక పలుపుతాడు లేకుండా ఉంటుందా? అలా ఉన్నట్లయితే గనుక.. ఆ పలుపుతాడును చేతపట్టుకుని ఉండేదెవ్వరు? శరద్ పవార్, సోనియాలేనా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

ఎన్డీయేనుంచి శివసేన బయటకు వస్తే తప్ప.. మద్దతు విషయంలో చర్చలు లేవు అని కాంగ్రెస్ కూటమి తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం శివసేన తమ పార్టీకి ఉన్న కేంద్రమంత్రి పదవిని పణంగా పెట్టింది. అయితే కాంగ్రెస్ కూటమి మాట తప్పలేదు. కొంత జాప్యం జరిగినప్పటికీ.. ప్రస్తుతానికి శివసేనకు మద్దతిచ్చే విషయంలో అంగీకారం కుదిరినట్లే కనిపిస్తోంది.

ఇప్పటికి వెలువడుతున్న వార్తలను బట్టి.. సీఎం పీఠాన్ని పంచుకోవడం కోసం ఎన్సీపీగానీ, కాంగ్రెసు గానీ పట్టుపడుతున్నట్లు లేదు. నిజానికి శివసేనకంటె ఎన్సీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే తక్కువ. అలాంటప్పుడు.. వారు తమకు కూడా రెండున్నరేళ్లు సీఎం పీఠం ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడితే శివసేన చేయగలిగింది ఏమీలేదు.

పైగా కాంగ్రెస్‌కు దక్కిన 44 సీట్లు కూడా వారికి చాలా అవసరం. ముగ్గురమూ మూడు భాగాలుగా అయిదేళ్ల పదవీకాలాన్ని పంచుకుందాం.. అని కాంగ్రెస్ భీష్మించుకున్నా.. సమీకరణాలు తదనుగుణంగా మారిపోవాల్సిందే. ఈమూడింటిలో ఏ ఒక్కరికీ కూడా మరో గత్యంతరం లేదు.

కానీ అయిదేళ్ల పదవీకాలంలోనూ శివసేన మాత్రమే సీఎం పీఠంపై ఉండేలా.. ఈ రెండు పార్టీలూ ఎందుకంత త్యాగపూరిత వైఖరిని అవలంబిస్తున్నాయనే సంగతి తెలియదు.

చూడబోతే.. సీఎం కుర్చీపై శివసేనను కూర్చోబెట్టి.. పాలన పగ్గాలు మొత్తం తమ చేతిలో ఉంచుకుని, కీలుబొమ్మలాగా ఆ ప్రభుత్వాన్ని ఆడించడానికి పవార్, సోనియా స్కెచ్ వేస్తున్నారా అనే సందేహాలు పలువురికి కలుగుతున్నాయి.