టీవీ చాన‌ళ్ల క‌రోనా శాడిజంపై.. సూప‌ర్ కార్టూన్!

ఈ కార్టూన్ 'ది వీక్' మ్యాగ‌జైన్ వాళ్లది. 'మైండ్ ఇట్' అంటూ ఒకే క్యాప్ష‌న్ తో దీన్ని పోస్టు చేశారు. గ‌త నెల రోజులుగా టీవీ చాన‌ళ్ల ట్రెండ్ ను చూస్తే…అస‌లు ఈ చాన‌ళ్ల‌ను…

ఈ కార్టూన్ 'ది వీక్' మ్యాగ‌జైన్ వాళ్లది. 'మైండ్ ఇట్' అంటూ ఒకే క్యాప్ష‌న్ తో దీన్ని పోస్టు చేశారు. గ‌త నెల రోజులుగా టీవీ చాన‌ళ్ల ట్రెండ్ ను చూస్తే…అస‌లు ఈ చాన‌ళ్ల‌ను జ‌నాలు ఎలా చూస్తున్నార‌బ్బా? అనే సందేహం వ‌స్తుంది. ప్ర‌తి ప‌ది నిమిషాల‌కూ ఒక బ్రేకింగ్ న్యూస్ వేస్తారు. అదేదో బ్ర‌హ్మాండం బ‌ద్ధ‌లైపోతున్న‌ట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసి.. జ‌నాల‌ను మామూలుగా బెద‌ర‌గొట్ట‌డం లేదు!

నిజ‌మే.. క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్ర‌పంచంలో ఆ పెరుగుద‌ల ల‌క్ష‌ల్లో ఉంది, ఇండియాలో వంద‌లు, వేల స్థాయిలో పెరుగుతూ ఉంది. ఏపీ తెలంగాణ‌ల్లో ప్ర‌తి రోజూ ప‌దుల సంఖ్య‌ల్లో కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీన్ని ఎవ్వ‌రూ కాద‌న‌డం లేదు. క‌రోనా అనేది ప్ర‌పంచానికి పూర్తిగా కొత్త‌, ఈ వైర‌స్ ను ఎదుర్కొన‌డం విష‌యంలో ఏ  రోజుకారోజు ప్ర‌గ‌తిని సాధిస్తూ ఉన్నామ‌ని వైద్య ప‌రిశోధ‌కులు బ‌ల్ల‌గుద్ది చెబుతూ ఉన్నారు.

ఒకేసారి క‌రోనా మీద విజ‌యం సాధించలేమోమో కానీ, అతి త‌క్కువ స‌మ‌యంలోనే క‌రోనాను జ‌యించే దిశ‌గా ముందుకు సాగుతూ ఉంద‌ని వారు చెబుతూ ఉన్నారు. అయితే వారి మాట‌ల్లోని విశ్వాసాన్ని ఈ టీవీ చాన‌ల్ గొర్రెలు  ఏ మాత్రం చూప‌డం లేదు! ఎంత‌సేపూ.. నంబ‌ర్ పెరిగింది, నంబ‌ర్ పెరిగింది! అది పెరుగుతూనే ఉంది, మ‌రి కొన్నాళ్లు పెరుగుతుంది కూడా!

దాన్ని గంట‌కూ, అర‌గంట‌కూ చెప్పి..బీభ‌త్స‌మైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసి ప్ర‌జ‌ల‌ను బెద‌ర‌గొట్టాలా? క‌రోనా పాజిటివ్ విష‌యంలో టీవీ చాన‌ళ్లు పూర్తిగా నెగిటివ్ ట‌ర్న్ తీసుకున్నాయి. దేశాల మ‌ధ్య‌న , రాష్ట్రాల మ‌ధ్య‌న పోటీలు పెట్టిన‌ట్టుగా ఇవి ఫీల‌వుతున్నాయి. ఆ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం దాటిపోయింద‌ని, ఆ దేశాన్ని ఈ దేశం వెన‌క్కు నెట్టింద‌ని.. ఏదో క్రికెట్ స్కోర్ చెబుతున్న‌ట్టుగా చెబుతూ టీవీ చాన‌ళ్ల వాళ్లు త‌మ శాడిజాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఉన్నాయి. స‌మాచారం ఇవ్వ‌డంలో త‌ప్పు లేదు కానీ.. ప్ర‌జ‌ల‌ను పూర్తిగా భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసేలా, చూసే వాళ్ల‌కు ఏ హార్ట‌టాకో వ‌చ్చేలా తెలుగు టీవీ చాన‌ళ్ల తీరు ఉంది.

పేర్లు అన‌వ‌స‌రం కానీ.. ఈ విష‌యంలో ఒక్కోరి శాడిజం ఒక్కో స్థాయిలో ఉంది. వీళ్ల తీరు చూస్తుంటే.. లాక్ డౌన్ ను పాటిస్తూ, టీవీల‌కు అతుక్కుపోయిన జ‌నాల‌కు లోప‌ల్లోప‌లే క‌రోనాను తెప్పించేలా ఉంద‌ని 'ది వీక్' కార్టూనిస్టు వ్యంగ్యంగా చెప్పాడు. వేయ‌డానికి మ‌రే వార్తా లేక 24 గంట‌లూ ఏదో ఒక సోది చెప్ప‌డానికి.. టీవీ వార్తా చాన‌ళ్లు ప్ర‌ద‌ర్శిస్తున్న శాడిజానికి ప్ర‌తీక‌లా ఉంది ఈ కార్టూన్.

లోకమణి అమ్మకి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు