ఆంధ్ర నుంచి ఎంతో మంది అత్యున్నత పదవులు అలంకరించారు. రాష్ట్రపతులు అయిన వారూ వున్నారు. ఉపరాష్ట్రపతి గా గత అయిదేళ్లుగా పదవిలో వున్న వెంకయ్యనాయుడు ఇలాంటి వారిలో ఒకరు. కానీ వెంకయ్యను ఓ వర్గం మిగిలిన వారికి దూరం చేసిందనే చెప్పాలి.
తెలుగు వ్యక్తిగా వెంకయ్య ను కీర్తించాల్సింది పోయి, ఓ సామాజిక వర్గం తమ వాడు అన్నట్లు ఓన్ చేసుకునే విధంగా వ్యవహరించింది. నిజానికి కర్ణాటక,తమిళ నాడులతో కూడా వెంకయ్యకు మంచి పరిచయాలు వున్నాయి.
కానీ తెలుగుదేశంతో ఎక్కువగా కలవడం ద్వారా, ఓ వర్గం మీడియా ఆయనను వీలయినంత మీదకు ఎత్తే ప్రయత్నం చేయడం ద్వారా, అనవసరంగా మిగిలిన వారు ఆయనకు దూరం అయ్యేలా చేసారు.
సరే, ఆ సంగతి అలా వుంచితే వెంకయ్యను రాష్ట్రపతి చేస్తారంటూ విపరీతంగా కథనాలు వండి వార్చారు. ఢిల్లీలో వాస్తవ పరిస్థితి తెలిసినా, తెలియనట్లు, లాస్ట్ మినిట్ వరకు ఇదే హడావుడి చేసారు. అదంతా అయిపోయింది.
ఇప్పుడు వెంకయ్యకు ఎక్స్ టెన్షన్ ఇస్తారంటూ వార్తలు వండుతున్నారు. కానీ ఢిల్లీ వర్గాల భోగట్టా వేరుగా వుంది. దక్షిణాదికి చెందిని ఓ గవర్నర్ ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రపతి పదవికి ఉత్తరాదికి కేటాయించినందున, ఉపరాష్ట్రపతి పదవి దక్షిణాదికి ఇవ్వాలనే భాజపా ఆలోచించాల్సి వుంటుంది. కేరళ, కర్ణాటక గవర్నర్ లలో ఒకరికి అవకాశం వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ లెక్కన వెంకయ్య నాయుడికి మరో దఫా అవకాశం లేనట్లే. బహుశా ఆయన కూడా ఇక ప్రశాంత జీవితం గడుపుదామని అనుకుంటూ వుండి వుండొచ్చు.
సాంప్రదాయ రాజకీయాలను చూసిన వెంకయ్య నాయుడికి వర్తమాన రాజకీయ పోకడలు అంతగా రుచించడం లేదు. చాలా సార్లు ఆయన ప్రసంగాల్లో ఈ విషయం బయటపడింది.
అందువల్ల హాయిగా పుస్తక పఠనం లేదా పుస్తక రచనలోనో, స్వర్థభారతి సేవా కార్యక్రమాల్లోనో కాలం గడపాలని అనుకుంటూ వుండి వుండొచ్చు.