వైఎస్ వివేకా హత్యపై కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేస్తూ జగన్ సర్కార్‌కు లేఖ రాశారు.
మాజీ మంత్రి , బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి కూడా కన్నా డిమాండ్‌ను సమర్థిస్తున్నట్టు తెలిపారు. అలాగే కడప జిల్లా ఎమ్మెల్సీ బీటెక్ రవి వివేకా హత్య కేసును సీబీకి అప్పగించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాడు. లేదంటే రాష్ట్ర హోంశాఖ, డీజీపీతో సంబంధం లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు.
ఈ ఏడాది మార్చి 15న పులివెందులలో వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో మృతి చెందారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత హత్యగా నిర్ధారించారు. పోస్టుమార్టంలో వివేకానంద రెడ్డి మృతదేహం మీద 7 కత్తిపోట్లు ఉన్నాయని, మెడ మీద, వెనుక, చేతి మీద, తొడ మీద బలమైన గాయాలు ఉన్నట్టు తేలింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది కడప అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించారు.
సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందు జరిగిన ఈ హత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. నాటి సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఆదేశాల మేరకు నాటి మంత్రి ఆదినారాయణరెడ్డే వివేకాను అంతమొందించాడని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నాటి ప్రతిపక్ష నేత, వివేకా అన్న కుమారుడైన జగన్ డిమాండ్ చేశారు. కేంద్రంలో తనకు అనుకూలమైన మోడీ సర్కార్ ఉండడం వల్లే సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ చేస్తున్నాడని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
వివేకా హత్యపై దర్యాప్తును ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, కొందరు మంత్రులు, పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారని , సిట్ దర్యాప్తు సక్రమంగా సాగుతుందన్న నమ్మకం తమకు లేదని, అందువల్ల కేసును సీబీఐకి లేదా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థిస్తూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, జగన్ కోర్టును ఆశ్రయించారు.
జగన్ తరపు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, సౌభాగ్యమ్మ తరపు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సిట్ దర్యాప్తుపై స్టే విధించి, కేసు దర్యాప్తును సీబీఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని అభ్యర్థించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ అధికారంలోకి రావడం, సిట్-2 ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసులో ఇంటిదొంగలున్నారని, వారిని ఈశ్వరుడైనా పట్టలేరని ఆరోపించారు. అంతేకాదు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో వివేకా భార్య, జగన్ ఏ విధంగానైతే కేసును సీబీఐకి లేదా రాష్ర్ట ప్రభుత్వంతో సంబంధం లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని హైకోర్టును ఆశ్రయించారో, అదే రకమైన డిమాండ్‌ను ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీ నేతలు చేయడం గమనార్హం. ఈ మేరకు విచారణ ఎదుర్కొంటున్న బీటెక్ రవి ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు.
ఒకప్పుడు తాను కోరుకున్న సీబీఐకి కేసు అప్పగించేందుకు సీఎం వైఎస్ జగన్‌కు భయమెందుకని పౌరసమాజం నుంచి ఎదురవుతున్న ప్రశ్న. లేదంటే తన పాలనలో పోలీస్ వ్యవస్థపై నమ్మకంతోనే సీబీఐకి అప్పగించేందుకు ఇష్టపడడం లేదా? ఏది ఏమైనా అనవసర అనుమానాలు, ఆరోపణలకు తావు ఇవ్వకుండా సాధ్యమైనంత త్వరగా వివేకా కేసును కొలిక్కి తేవాల్సిన అవసరం ఉంది.