Advertisement

Advertisement


Home > Politics - Gossip

సీఎం జగన్ ఇప్పుడేం చేస్తారో చూడాలి!

సీఎం జగన్ ఇప్పుడేం చేస్తారో చూడాలి!

ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. రాష్ట్ర విభజన నాటికి ఏపీకి 97 వేల కోట్ల అప్పులు ఉంటే, చంద్రబాబు పుణ్యమా అని అవి ఇప్పటికి 2 లక్షలా 60 వేల కోట్ల రూపాయలకు చేరాయి. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర బడ్జెట్ కంటే అప్పులే అధికంగా ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ. ఇకపై విద్యుత్ కు కూడా ముందే చెల్లించాలంటూ కేంద్రం కండిషన్ పెట్టింది.

రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ తో పాటు కేంద్రం నుంచి కొంత వాటాను తీసుకునే సౌలభ్యం ఎప్పుడూ ఉంటుంది. ఇన్నాళ్లూ రాష్ట్రాలన్నీ అదే చేశాయి. కేంద్రానికి చెల్లించాల్సిన మొత్తం బకాయిగా ఉండేది. కాస్త ఆలస్యమైనా అది పెద్దగా ఆందోళన పడాల్సిన విషయంగా ఉండేదికాదు. సరిగ్గా ఇక్కడే కేంద్రం మెలికపెట్టింది. ఇకపై ముందుగానే డబ్బులు చెల్లించి విద్యుత్ తీసుకోవాలని నిబంధన విధించింది. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ఇది చాలా పెద్ద దెబ్బ.

ఏపీలో రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. కేంద్ర సంస్థ అయిన ఎన్టీపీసీ నుంచి విద్యుత్ తీసుకోవడం అనివార్యం. ఇలాంటి టైమ్ లో ముందుగానే డబ్బు చెల్లించి విద్యుత్ తీసుకోవాలంటే అది ప్రభుత్వానికి మరింత అదనపు భారం కానుంది. లెటర్ ఆఫ్ క్రెడిట్ మీదే విద్యుత్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే ముందుగానే బ్యాంకులో డబ్బు వేసి, ఆ బ్యాంక్ నుంచి భరోసా ఇప్పించిన తర్వాతే రాష్ట్రానికి విద్యుత్ వస్తుందన్నమాట.

ఎన్టీపీసీకి ఇప్పటికే 45వేల కోట్ల రూపాయల బకాయిలున్నాయి. ఆ బకాయిల్ని రాబట్టేందుకే కేంద్రం ఈ ఎత్తుగడ వేసిందనే విషయం స్పష్టమౌతోంది. కానీ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మినహాయింపు ఇస్తే బాగుండేది. తెలంగాణ లాంటి ధనిక రాష్ట్రాలకు ఇలా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం పెద్ద కష్టంకాదు. కానీ అప్పుల్లో ఉన్న ఆంధ్రా లాంటి రాష్ట్రాలు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వలేవు.

నెలరోజుల కిందట ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఇకపై కేంద్రం నుంచి విద్యుత్ తెచ్చుకోవాలంటే.. నెలకు వందల కోట్ల రూపాయలు వాళ్లకు ముందస్తుగానే చెల్లించాలి. అరకొరగా ఆదాయం కలిగిన రాష్ట్రానికి ఇది పెనుభారం కాబోతోంది. డబ్బులు కట్టకపోతే కరెంట్ అందదు. అప్పుడు రాష్ట్రంలో విద్యుత్ కోతలు మళ్లీ మొదలవుతాయి.

ఈరోజు ఈ సమస్యపై జగన్ అధికారులతో చర్చించబోతున్నారు. ప్రజల నిత్యావసరం అయిన విద్యుత్ విషయంలో ఇలా కేంద్రం ఆకస్మికంగా నిబంధన విధించడంతో చాలా రాష్ట్రాలు ఇక్కట్లుపడక తప్పదు. దీనిపై రాష్ట్రాల డిస్కమ్ లు ఏకపై పోరాటం చేయక తప్పదు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే కేంద్రంపై ఈ పోరాటం మొదలవుతుందేమో చూడాలి.

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?