జూనియర్ ఎన్టీఆర్ పై లోకేష్ మెత్తబడ్డాడా?

జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ ఎంతలా తొక్కిపెట్టాలో అంతా చేసింది. 2009 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ రాజకీయ ముఖచిత్రంపై కనిపించలేదంటే దానికి కారణం చంద్రబాబు, ఆయన పార్టీ వేసిన ఎత్తుగడలు. ఎక్కడ…

జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ ఎంతలా తొక్కిపెట్టాలో అంతా చేసింది. 2009 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ రాజకీయ ముఖచిత్రంపై కనిపించలేదంటే దానికి కారణం చంద్రబాబు, ఆయన పార్టీ వేసిన ఎత్తుగడలు. ఎక్కడ పార్టీలో కీలకంగా మారతాడో అనే భయంతో చంద్రబాబు ఈ పనిచేశారు. మరీ ముఖ్యంగా లోకేష్ కు లైన్ క్లియర్ చేసే ఉద్దేశంతో బాబు ఈ పన్నాగాలన్నీ పన్నారు.

అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. టీడీపీ ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది. జగన్ దెబ్బకు చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఘోర పరాజయం పాలైంది. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జూనియర్ వస్తే పార్టీకి బలం వస్తుందని చాలామంది స్టేట్ మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వీటిపై ఎప్పటికప్పుడు తమ నాయకులతో చంద్రబాబు ఖండన ప్రకటనలు ఇప్పిస్తూనే ఉన్నారు. తాజాగా బాలయ్య చిన్నల్లుడు కూడా ఎన్టీఆర్ అవసరం లేదంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడీ వ్యవహారానికి భిన్నంగా లోకేష్ స్పందించడం సంచలనం అయింది.

కార్యకర్తల డిమాండ్ తో జూనియర్ ఎన్టీఆర్ అంశంపై లోకేష్ మరోసారి స్పందించాల్సి వచ్చింది. నాయకుడు చంద్రబాబు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని, అది వాళ్లిద్దరికి సంబంధించిన విషయం అంటూ తప్పించుకున్న లోకేష్, ఈసారి మాత్రం విభిన్నంగా రియాక్ట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అందరిదీ అంటూనే, ఎవరైనా పార్టీలోకి రావొచ్చని, పార్టీ కోసం పనిచేయొచ్చని లోకేష్ అన్నారు. ఓవైపు కార్యకర్తలంతా ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తుంటే, లోకేష్ మాత్రం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకుండా ఇలా కాస్త సాఫ్ట్ గా స్పందించారు.

లోకేష్ స్పందనను పక్కనపెడితే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చాలామంది నేతలకు ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉంది. కానీ చంద్రబాబు వద్ద ఆ విషయాన్ని చెప్పడానికి జంకుతున్నారు. బాబు మాత్రం ఆరునూరైనా తన తర్వాత లోకేష్ నే పార్టీకి పెద్ద దిక్కుగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. ఆయన భవిష్యత్ ప్రణాళిక కూడా అదే. మరోవైపు ఎన్టీఆర్ మాత్రం ఈ చర్చతో సంబంధం లేకుండా రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం బల్గేరియాలో ఉన్నాడు ఎన్టీఆర్.

తెలుగులో సినీప్రియుల రూటు మారింది