అమరావతి రాజధాని ప్రాంతంపై అనేకానేక వివాదాలు రేగుతున్నాయి. వీటిని రాజకీయ వివాదాలుగా మార్చి లబ్ధి పొందాలనుకునే వారు కొందరు, రియల్ ఎస్టేట్ వివాదాలుగా మార్చి లబ్ధిపొందాలని అనుకునేవారు మరికొందరు. ఇలా అంతా గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల కష్టనష్టాలను స్వయగా తెలుసుకోవడానికి జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. అయితే రైతుల కష్టాలు తెలుసుకున్న తరువాత.. ఆయన ముఖ్యమంత్రిని కూడా కలిసి.. తను గమనించిన విషయాలను నివేదిస్తారా లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది.
ఎందుకంటే.. పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంత రైతుల మీద ప్రేమ చూపించడం ఇది తొలిసారి కాదు. గతంలో 2015లో కూడా లాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తున్న వారికి ఆయన అండగా నిలిచారు. ఆ మేరకు మాట ఇచ్చి.. ఆ ప్రాంతంలో పర్యటించి.. వారి అభిప్రాయాలు, బాధలు తెలుసుకున్నారు. అయితే ఆ తర్వాత.. సీఎం చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లి.. అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలిసి.. తాను గమనించిన విషయాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. అప్పట్లో ఆయన చంద్రబాబుకు అధికార ప్రతినిధిలాగా వెళ్లినట్లున్నదంటూ వైకాపా విమర్శించింది కూడా.
ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతోంది. రాజధాని ప్రాంత రైతుల కన్నీళ్లు తుడవడానికి అనే ఎజెండాతో.. పవన్ కల్యాణ్ 30వ తేదీన అక్కడ పర్యటించడానికి డిసైడ్ అయ్యారు. షెడ్యూలు ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం దాకా పర్యటిస్తారు. రాజధాని పనుల పురోగతి ఏమిటో గమనిస్తారు. రైతుల బాధలేమిటో వింటారు. అంతా బాగానే ఉంది. మరి తానుకన్న, విన్న సమాచారాన్ని తెలియజెప్పడానికి మళ్లీ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తారా లేదా అనేది మీమాంస.
ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నది గనుకనే.. తాను తెలుసుకున్న విషయాల్ని సీఎంను కలిసి చెప్పానని అప్పట్లో పవన్ కల్యాణ్ సమర్థించుకున్నారు. ఆ రకంగా తాను చంద్రబాబు జేబులో మనిషి అంటూ వస్తున్న విమర్శలకు ఆయన సమాధానం చెప్పారు. మరి ఇప్పుడు కూడా అదే చిత్తశుద్ధితో అదే పనిచేయాలి కదా. ప్రజల కష్టాలు తెలుసుకున్నాక బాధ్యతగా ముఖ్యమంత్రిని కలిసి నివేదించాలి కదా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ ఏం చేస్తాడో చూడాలి.