చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. ఆయన వద్ద పీఎస్ గాపనిచేసిన శ్రీనివాస్ అవినీతి బాగోతం.. పుట్ట పిగిలినట్లుగా పిగిలి.. వేల కోట్ల అక్రమార్జనలు వెలుగులోకి రావడానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆరోజునుంచి ఈరోజుదాకా చంద్రబాబునాయుడు రెండువేల కోట్లు కాజేసారని, ఆ వ్యవహారంపై వివరణ చెప్పాలని.. వైకాపా శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే ఈ విషయంలో మింగలేక కక్కలేక చంద్రదళం ప్రముఖులంతా కిందామీదా అయిపోతున్నారు. ఏం చెబితే.. ఎటొచ్చి తమ పార్టీ అధినేత మెడకు చుట్టుకుంటుందో అని కంగారు పడుతున్నారు. అలాగని, వైకాపా వారి విమర్శల్ని యథేచ్ఛగా వదిలేయలేకపోతున్నారు.
వాస్తవంగా అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొన్ని ఇన్‌ఫ్రా సంస్థల వ్యవహారాలపై ఐటీశాఖ దాడులు నిర్వహించింది. ఆ క్రమంలో చంద్రబాబు మాజీ పీఎస్ ఇంటిలోనూ సోదాలు జరిగాయి. రోజుల తరబడి జరిగాయి. వీటిలో రెండు వేల కోట్ల అక్రమార్జనలు లెక్కతేలాయి. ఈ మొత్తం సొమ్ము ఒక్క శ్రీనివాస్ దే కాకపోవచ్చు. కానీ సహజంగానే వైకాపా నాయకులంతా.. ఇదంతా చంద్రబాబుకు ముడిపెడుతూ విమర్శల జడివాన కురిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ ఐటీ వ్యవహారంలో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. దీనిని తిప్పికొట్టడం ఎలాగో కూడా వారికి తెలియడం లేదు.
ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రెండు వేల కోట్ల అక్రమార్జనలపై వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మాత్రం అనగలుగుతున్నారు. వైకాపా కొంచెం అతి చేస్తున్న మాట నిజమే. ఆ విషయంలో తెలుగుదేశం ఏమీ తక్కువ తినలేదు. జగన్మోహన రెడ్డి మీద ఏ నేరమూ నిరూపణ కాకుండానే.. లక్ష కోట్లు తినేశాడంటూ పుస్తకాలు అచ్చేసి పంచిన చరిత్ర వాళ్లది. అలాంటివాళ్లు- మొత్తం రెండువేల కోట్లూ చంద్రబాబు ఖాతాలోకే పడినట్లుగా విమర్శలు వస్తుండేసరికి దుఃఖిస్తున్నారు.
అది తప్పు అంటున్నారు. నిజమే కావొచ్చు. వాస్తవంగా చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ వద్ద దొరికినది ఎంతో.. స్వయంగా చంద్రబాబే లెక్క చెప్పవచ్చు కదా! మిగిలిన సంస్థల అక్రమార్జనలతో తనకు సంబంధం లేదని, తన పేరు బయటకు లాగే వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించవచ్చు కదా..!
అలాంటి సాహసం ప్రస్తుతానికి చంద్రదళాలకు లేదు. చాలా లోతైన ఈ కేసులోంచి ఎలా బయటపడాలా అనే విషయంలోనే వారింకా మల్లగుల్లాలు పడుతున్నారు. అలాంటిది.. ప్రతివిమర్శలు చేయడంతో ఆగకుండా.. క్లారిటీ ఇవ్వపూనుకుంటే.. పూర్తిగా కూరుకుపోతారు.