మోదీపై టార్గెట్‌- బీజేపీ జాతీయ నేత కుట్ర‌!

ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడిని రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల్లో “మ‌న” అనుకునే వారు వుంటే ఎందుకైనా మంచిద‌నే భావ‌న వారిలో ఉండ‌డాన్ని అర్థం…

ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడిని రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల్లో “మ‌న” అనుకునే వారు వుంటే ఎందుకైనా మంచిద‌నే భావ‌న వారిలో ఉండ‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. ఒక‌ట్రెండు నెల‌ల్లో “మ‌న” అనుకునే వారు అత్యున్న‌త రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల్లో ఒక్క‌రూ కూడా ఉండ‌ర‌నే ఆవేద‌న ముఖ్యంగా ఆ సామాజిక వ‌ర్గంలో క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వెంక‌య్య‌నాయుడుని రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపి చేస్తున్న‌ట్టు త‌మ‌కు తామే క‌థ‌నాలు వండివార్చారు. చివ‌రికి వారి అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందులు కావ‌డంతో రివ‌ర్స్ ఎటాక్ మొద‌లు పెట్టారు. వెంక‌య్య‌నాయుడిని రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌క‌పోవ‌డం సౌత్ ఇండియాను చిన్న‌చూపు చూడ‌డమే అనే రేంజ్‌లో డిబేట్‌లు పెట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తెలుగు స‌మాజం అంటే ఆ సామాజిక వ‌ర్గ‌మే అన్న‌ట్టు త‌మ చేతిలో ఉన్న మీడియాని అడ్డు పెట్టుకుని ఇష్టానుసారం డిబేట్స్ పెట్ట‌డం గ‌మ‌నార్హం.

త‌న‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై వెంక‌య్య‌నాయుడికి బాధ వుందో లేదో తెలియ‌దు కానీ, ఆయ‌న సామాజిక వ‌ర్గంలోని కొంద‌రు పెద్ద‌లు మాత్రం జీర్ణించుకోలేకున్నారు. మొట్ట‌మొద‌టిసారిగా ఓ గిరిజ‌న మ‌హిళ‌ను దేశంలోనే అత్యున్న‌త ప‌ద‌వికి బీజేపీ ఎంపిక చేసినా, ప్ర‌శంసించాల‌నే సంస్కారం లేక‌పోవ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. 

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా గిరిజ‌న మ‌హిళ‌ను ఎంపిక చేస్తే, వైసీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినా బీజేపీలోని ఓ నాయ‌కుడు మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. వైసీపీ మ‌ద్ద‌తు ఎన్‌డీఏకి మాత్ర‌మే అని టీడీపీ-బీజేపీ ఉమ్మ‌డి నాయ‌కుడు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నాడాయ‌న‌. దీన్ని బ‌ట్టి ఆయ‌న‌ అంత‌రంగాన్ని అర్థం చేసుకోవ‌చ్చు.

వెంక‌య్య‌నాయుడిని రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌ని నేప‌థ్యంలో, ప్ర‌ధాని మోదీని ఎల్లో మీడియా టార్గెట్ చేయ‌డం వెనుక సొంత‌ పార్టీ జాతీయ నాయ‌కుడి హ‌స్తం ఉన్న‌ట్టు బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లిన‌ట్టు స‌మాచారం. స‌ద‌రు ఎల్లో మీడియాలో కాల‌మిస్టుగా ఆయ‌న కొన‌సాగుతున్నార‌నే సంగ‌తిని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు తెలిసింది. ఆయ‌న‌ వ‌ల్ల ఏపీలో బీజేపీకి న‌యాపైసా ప్ర‌యోజ‌నం లేక‌పోయినా స‌రే, పార్టీ పెద్ద‌ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టింద‌ని అగ్ర‌నాయ‌కులు గుర్తు చేస్తున్నారు.

ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం ఎల్లో మీడియాకి లేదంటున్నారు. కేవ‌లం ఆ కాల‌మిస్టు, జాతీయ నాయ‌కుడిగా చెలామ‌ణి అయ్యే ఏపీ గ‌ల్లీ లీడ‌ర్ ప్రోత్సాహంతోనే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో ప్ర‌ధాని మోదీ, బీజేపీ నేర చేశార‌నే సంకేతాల్ని పంపేందుకు కూడా వెనుకాడ‌డం లేద‌నే ఫిర్యాదులు వెళ్లిన‌ట్టు తెలిసింది. 

పార్టీని బ‌లోపేతం చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌ని, కానీ బ‌ల‌హీన‌ప‌రిచేలా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఆయ‌న “అస‌త్య‌”వాక్కులు ప‌ల‌కించ‌డం వెనుక అస‌లు క‌థేంటో తేల్చాల‌ని బీజేపీ అగ్ర‌నేత‌ల‌ను కొంద‌రు సొంత పార్టీ నేత‌లు కోరిన‌ట్టు స‌మాచారం.