వైసీపీ కీలక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సెల్‌ఫోన్ స్విచాఫ్ చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. నెల్లూరు సిటీ వైసీపీ సమన్వయ కర్తగా ఎండీ ఖలీల్ పేరును శుక్రవారం అధిష్టానం ప్రకటించింది. ఈ నియామకం వేమిరెడ్డికి నచ్చకపోవడం వల్లే అలిగినట్టు ప్రచారమవుతోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ అభీష్టం మేరకు ఖలీల్‌కు టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
అనిల్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని, ఒకవేళ కాదు, కూడదని ముందుకెళితే తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేయనని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే సీఎంకు తేల్చి చెప్పారు. దీంతో నరసారావుపేట ఎంపీ స్థానం నుంచి అనిల్‌ను బరిలో దింపారు. ఈ నేపథ్యంలో అనిల్ సూచించిన ఖలీల్‌ను నెల్లూరు బరిలో దింపడాన్ని వేమిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది.
వైసీపీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేమిరెడ్డి ఆ పార్టీకి దూరంగా ఉంటానంటూ సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి చెన్నైకి వెళ్లినట్టు తెలిసింది. వేమిరెడ్డి అలక విషయం తెలుసుకున్న వైసీపీ పెద్దలు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన అందుబాటులోకి రావడం లేదు. వేమిరెడ్డిని పట్టుకోవడం వైసీపీకి కష్టంగా మారింది. దీంతో ఆయన వెంట ఎవరున్నారో తెలుసుకునేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. వేమిరెడ్డి వెంట ఉన్న నేతలకు ఫోన్ చేసి, ఆయనతో మాట్లాడి సమస్య తెలుసుకోవాలని పార్టీ పెద్దలు ఆసక్తి చూపుతున్నారు.
నిజానికి రాజకీయాల్లో అయిష్టంగా కొనసాగుతున్నట్టు వేమిరెడ్డి తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఈ రాజకీయ పోకడలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీకి ఆర్థికంగా పలు సందర్భాల్లో అండగా వుంటూ వచ్చారు. అలాంటి తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నెల్లూరు సిటీ అభ్యర్థిని నియమిస్తే, తానెందుకు ఎంపీగా పోటీ చేయాలనేది ఆయన ప్రశ్న.