నిమ్మగడ్డ పునర్నియామకం విషయం చివరికి ఏపీ సర్కార్ చెంతకు చేరింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సోమవారం గవర్నర్ విశ్వభూషణ్‌ను కలిసి…తనను తిరిగి నియమించాలని అభ్యర్థించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే జగన్ సర్కార్ నిర్ణయం ఏంటో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డపై శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూడకుండా నిమ్మగడ్డకు ఎందుకంత తొందరని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. రాజ్యాంగ పదవిలో ఉండాలని కోరుకునే వ్యక్తి….హోటళ్లలో టీడీపీ నాయకులతో మంతనాలు జరపడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా ఆయన ప్రవర్తించడం లేదన్నారు.
గవర్నర్ సూచనలు లేదా ఆదేశాల నేపథ్యంలో నిమ్మగడ్డను జగన్ సర్కార్ తిరిగి నియమిస్తుందా లేదా అనే సంశయాలున్న వారికి శ్రీకాంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ సమాధానాలిస్తుంది. నిమ్మగడ్డ వ్యవహారంపై ఆయన ఏమన్నారంటే…
హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ నుంచి సూచనలు వచ్చాయన్నారు. హైకోర్టు తీర్పును, గవర్నర్ ఆదేశాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలపై తమకు అభ్యంతరా లున్నాయన్నారు. అందువల్లే తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లిందని ఆయన చెప్పుకొచ్చారు.
సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. వ్యవస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని గవర్నర్‌కు తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తర్వాత ఏం చేయాలో అడ్వొకేట్ జనరల్ నిర్ణయిస్తారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
నిమ్మగడ్డ కూడా సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూడాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారో చూస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ పదవికి ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. లాయర్ల కోసం నిమ్మగడ్డకు కోట్లాది రూపాయల డబ్బు ఎవరు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తి ఎస్ఈసీ కుర్చీలో కూచుంటే అది ప్రజాస్వామ్యం ఓడినట్టు కాదా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ సర్కార్ వైఖరి ఏంటో శ్రీకాంత్‌రెడ్డి మాటలు ప్రతిబింబించాయి.