తెలంగాణలో కేసీఆర్ సర్కార్, గవర్నర్ తమిళిసై మధ్య రోజురోజుకూ గ్యాప్ పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏం మాట్లాడ కుండానే తన చర్యల ద్వరా గవర్నర్‌కు కోపం తెప్పిస్తోంది. బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించకుండా గవర్నర్ విషయంలో తన అసంతృప్తి, నిరసనను తెలంగాణ సర్కార్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడంపై ఇప్పటికే గవర్నర్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతటితో గవర్నర్ ఆగ్రహం చల్లారలేదు. తెలంగాణ సర్కార్ తనను విస్మరించడాన్ని గవర్నర్ తమిళిసై జీర్ణించుకోలేన్నారు. దీంతో తెలంగాణ సర్కార్‌పై పరోక్షంగా మండిపడుతున్నారు. కేసీఆర్‌కు ఆమె పరోక్ష వార్నింగ్‌లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ సర్కార్‌తో వివాదం నడుస్తున్న నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
‘సమాన హక్కుల కోసం మనమంతా ఒకవైపు డిమాండ్ చేస్తుంటే అన్ని స్థానాల్లో, చివరకు ఉన్నత పదవు ల్లోని మహిళలూ ఇంకా వివక్షకు గురవుతున్నారు. నన్ను ఎవరూ భయపెట్టలేరు. నేను దేనికీ భయపడను కూడా’అని కేసీఆర్ సర్కార్‌ను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ పరోక్షంగా హెచ్చరించారనే చర్చ జరుగుతోంది. తననెవరో భయపెట్టాలని చూస్తున్నారనే భావన మనసులో ఉంటే తప్ప గవర్నర్ నుంచి ఇలాంటి మాటలు రావనే చర్చకు తెరలేచింది.
అలాగే బడ్జెట్ సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడాన్ని కేసీఆర్ సర్కార్ చూపుతున్న వివక్షగా భావిస్తున్నట్టు తమిళిసై మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గవర్నర్‌ను బీజేపీ నాయకురాలిగానే కేసీఆర్ సర్కార్ చూస్తోందనే విమర్శలు తెరపైకి వచ్చాయి. కేంద్రంతో యుద్ధం మొదలు పెట్టిన నేపథ్యంలో గవర్నర్‌ను కూడా ప్రత్యర్థి పక్షం కింద లెక్కేసినట్టే కనిపిస్తోంది.
బడ్జెట్ సమావేశాలకు పిలవకపోవడం, అలాగే రిపబ్లిక్ డే నాడు రాజ్‌భవన్‌కు కేసీఆర్ వెళ్లకపోవడం తదితర అంశాలన్నీ తనను భయపెట్టే చర్యలుగా తమిళిసై భావిస్తున్నట్టు తాజాగా ఆమె హెచ్చరికలే ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయాలు లేకపోలేదు. ఏది ఏమైనా తెలంగాణలో గవర్నర్, సర్కార్ మధ్య విభేదాలు భవిష్యత్‌లో ఏ మలుపు తీసుకోనున్నాయో అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.