గత కొన్ని రోజులుగా ఉద్యోగులతో స్నేహ పూర్వక వాతావరణంలో సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తూ వచ్చింది. అయితే ఉద్యోగుల వైపు నుంచి సానుకూల స్పందన రాకపోగా, కవ్వించేలా వారి చర్యలున్నాయి. ఉద్యోగుల తీరుపై ప్రజానీకంలో కూడా అసహనం కలుగుతోంది. ప్రభుత్వం పిలుస్తున్నా చర్చలకు వెళ్లకపోవడం, ఉద్యోగుల అహంకారానికి నిదర్శనమనే విమర్శలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ కాసింత గట్టిగానే ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలా వ్యవహరించనుందో ఆయన మాటల్లో స్పష్టమైంది. ఒకవైపు విన్నవించుకుంటూనే, మరోవైపు సమస్యను ఉద్యోగుల కోర్టులోనే వేయడం గమనార్హం. తాము చర్చలకు ఆహ్వానిస్తుంటే ఉద్యోగులు అలుసుగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాట్లాడకుండా ఇంట్లోనే కూచుంటామంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని నర్మగర్భ హెచ్చరిక చేశారు. ఘర్షణ వాతావరణం వద్దు…చర్చలకు రావాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగ సంఘాలు కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నాయని మండిపడ్డారు. ఇకపై రోజూ వచ్చి సచివాలయంలో ఎదురు చూడమని తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాలు పిలిస్తేనే చర్చలకు వస్తామని మంత్రి బొత్స స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రతిరోజూ పీఆర్సీ సాధన కమిటీ నేతల్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం, వాళ్లు వచ్చే ప్రశ్నే లేదని భీష్మించుకుని కూచో వడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం తగ్గి చర్చలకు పిలుస్తుంటే, దాదాపు అరకోటి ఓట్లున్న తామంటే సర్కార్ భయపడు తోందనే భ్రమలో ఉద్యోగులున్నారు. అందుకే చర్చలకు రమ్మంటున్న ప్రభుత్వ ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పైగా షరతులు విధిస్తూ ప్రజా ప్రభుత్వం మెడలు వంచి పంతం నెగ్గించుకోవాలనే దురంహకారంతో ఉద్యోగులు విరవీగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిరోజూ సచివాలయంలో మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దలు ఎదురు చూడడం ప్రహసనంగా మారింది. తాము పని చేయకపోతే ప్రభుత్వం, సమాజం మొత్తం స్తంభిస్తుందని, అందువల్ల తమ గొంతెమ్మ కోర్కెలను తీర్చక తప్పదనే భావనలో ఉద్యోగులు ఉన్నారు. అయితే ప్రభుత్వ సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. అది కాస్త శుక్రవారంతో నశించినట్టుంది. అందుకే ఇక మీదట ఉద్యోగులు పిలిస్తే తప్ప చర్చలకు వెళ్లే ప్రశ్నే లేదని బొత్స తేల్చి చెప్పారు.
బొత్స అన్నట్టు ఉద్యోగులు మొండిపట్టుదలకు పోతే ఉపయోగం ఉండదు. అతి ఎప్పటికీ, ఎవరికీ మంచిదికాదు. ఈ వాస్తవాన్ని ఉద్యోగులు గ్రహిస్తే మంచిది. లేదంటే ప్రభుత్వమే కాదు, అంతకు మించి తాము కూడా నష్టపోతామని ఉద్యోగులు గ్రహించాల్సి వుంది. తెగే వరకూ లాగితే నష్టపోయేదెవరో కాలం అనేక మార్లు చూపింది. తెలుసుకోవాల్సింది ఉద్యోగులే.