కరోనా కష్టకాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ సమీకరణలో భాగంగా తమ ఆధీనంలోని భూముల అమ్మకానికి పూనుకున్నాయి. కర్ణాటక ప్రభుత్వం అయితే.. బెంగళూరులో మహానగరంలోనే భూములు అమ్ముతోంది. అందుకు సంబంధించి అమ్మకానికి అవకాశం ఉన్న భూములను గుర్తించాలని ఆ మధ్యన యడియూరప్ప కేబినెట్ ప్రత్యేకంగా అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.
కర్ణాటక దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి. బెంగళూరు వంటి ఐటీ హబ్ తో భారీ ఆదాయ వనరు ఉన్న రాష్ట్రం. పంటలు, పారిశ్రామిక అభివృద్ధి, టూరిజం, పుష్కలమైన వర్షాలు.. అన్నీ ఉన్న రాష్ట్రం. ఇక భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసే రాష్ట్రం కూడా కాదు.
ఏపీలో అమలయ్యే పథకాలతో పోలిస్తే కర్ణాటకలో సంక్షేమ పథకాల స్థాయి చాలా తక్కువ. ఉన్న కొద్దో గొప్పో కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ వాళ్లు పెట్టి వెళ్లినవే. వాటిని యడియూరప్ప గవర్నమెంట్ అంతంత మాత్రంగానే అమలు చేస్తూ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. కరోనా లాక్ డౌన్ మొదలైన రెండో నెలలోనే ఆస్తుల అమ్మకానికి యడియూరప్ప ప్రభుత్వం రెడీ అయిపోయింది. అత్యంత ఖరీదైన బెంగళూరులోని భూములనే అమ్మడానికి రంగం సిద్ధం చేసింది.
కట్ చేస్తే.. ఏపీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకానికి సిద్ధపడినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక లేటే లేకుండా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా అందుకు సంబంధించి విచారణ చేసింది న్యాయస్థానం. ఈ సందర్భంగా ఆస్తుల అమ్మకానికి సంబంధించి ప్రభుత్వ లాయరు సంజాయిషీ ఇచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలును, మద్యం తరహా ఆదాయాలు తగ్గిన విషయాన్ని ప్రస్తావించారట. అయితే కోర్టు ఈ విషయంలో ఘాటుగా స్పందించినట్టుగా ఈనాడు లో రాశారు.
'ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో మాకు తెలుసు..' అని కోర్టు నర్మగర్భంగా వ్యాఖ్యానించిందట. అలాగే కరోనా సమయంలో మద్యం రేటును ప్రభుత్వం పెంచినా దాన్ని కొని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిన తాగుబోతులను కరోనా వారియర్లు అని వ్యంగ్యంగా అభివర్ణించారట న్యాయమూర్తులు. ఈ అంశంలో తదుపరి విచారణ ఈ నెల 17న జరగనుందట.
కరోనా సమయంలో మద్యం ధరలు పెరిగింది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ లో కాదు, కర్ణాటకలో కూడా మద్యం రేట్లను భారీగా పెంచారు! గత ప్రభుత్వాల హయాంలో ఆస్తుల అమ్మకాల విషయంలో ఇది వరకూ ఎప్పుడూ కూడా కోర్టుల్లో పిటిషన్ల వార్తలు రాలేదు. కర్ణాటకలో ఇప్పుడు కూడా రాలేదు.