జగన్ దృష్టిలో పడ్డవారికి గుడ్ డేసే మరి. ఆ లక్కీ ఇపుడు విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కి దక్కబోతోంది అంటున్నారు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరగబోతున్న నేపధ్యంలో పెగాసస్ ఉదంతం మీద విచారణకు సభా సంఘాన్ని ప్రభుత్వం నియమించింది.
ఈ సభా సంఘంలో సభ్యుడిగా గుడివాడ అమరనాధ్ ఉండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. పెగాసస్ మీద అమర్ గట్టిగానే మాట్లాడి చంద్రబాబు మీద వీర లెవెల్ లో దాడి చేశారు. ప్రభుత్వం వైపు నుంచి వినిపించిన కొన్ని గొంతులలో గుడివాడ ముందున్నారు.
ఈ నేపధ్యంలో ఆయనకు హౌస్ కమిటీ మెంబర్ షిప్ దక్కింది అనుకుంటున్నారు. అయితే దీన్ని గుడివాడ అనుచరులు, అభిమానులు మాత్రం పూర్తి పాజిటివ్ గా చూస్తున్నారు. జగన్ మనసులో గుడివాడ ఉన్నారని, అందుకే ఆయనకు ఇలా ప్రయారిటీ ఇచ్చారని చెబుతున్నారు.
ఇది శుభ సంకేతమని, రానున్న రోజుల్లో మంత్రి వర్గ విస్తరణలో గుడివాడకు కచ్చితంగా స్థానం ఉంటుంది అనడానికి దీన్ని ఒక ఉదాహరణగా చూడవచ్చు అని అంటున్నారు. ఆ మధ్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం మీద మాట్లాడే చాన్స్ విశాఖ నుంచి గుడివాడకే ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
ఇక ఈ హౌస్ కమిటీలో పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి కూడా ఉన్నారు. దాంతో ఆమెకు కూడా ఫ్యూచర్ బాగుండే చాన్స్ ఉందని లెక్క వేస్తున్నారు. చూడాలి మరి ఈ లెక్కలు అంచనాలు ఎంతమేరకు నిజమవుతాయో.