హర్యానా, మహారాష్ట్ర ల అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించింది ఎన్నికల కమిషన్. అక్టోబర్ 21 తేదీన ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రెండు రాష్ట్రాలకూ ఓకే దశలో, ఒకే తేదీన పోలింగ్ ఉంటుందని వివరించింది.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సీట్లు ఉండగా, హర్యానా అసెంబ్లీకి 90 సీట్లున్నాయి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఉనికి ఉంది. అయితే ఇటీవలి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ చిత్తు అయ్యింది.
అయితే లోక్ సభ ఎన్నికల లెక్క వేరు, అసెంబ్లీ ఎన్నికల తీరు వేరని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. తేడా ఉంటుందని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారం నిలుపుకోవడం భారతీయ జనతా పార్టీకి కూడా పరీక్షే. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగింది.
ఆ పట్టు తమకు ఉందని నిరూపించుకోవాలంటే ఈ రాష్ట్రాల్లో బీజేపీ నెగ్గాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పక్షాలు పుంజుకుంటే మాత్రం వాటికి కొత్త శక్తి దక్కినట్టే అని పరిశీలకులు అంటున్నారు. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24న విడుదల చేయబోతున్నట్టుగా ఈసీ ప్రకటించింది.