ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందు చూపునకు ఇదో నిదర్శనం. జగన్ సర్కార్ బాటలో హరియాణా సర్కర్ నడుస్తుండడం ఏపీకి గర్వకారణంగా చెప్పొచ్చు. ప్రైవేట్ రంగంలోని 75 శాతం ఉద్యోగాలను రాష్ట్ర యువతకే కేటాయించాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు హరియాణా కేబినెట్ సోమవారం ఆమోదించింది. రూ.50 వేలు లోపు వేతనం ఉన్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ …ఆ తర్వాత హామీ అమలుకు శ్రీకారం చుట్టారు.
గత ఏడాది ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జూలై 22న ఆరు బిల్లులను జగన్ సర్కార్ ప్రవేశ పెట్టింది. పారిశ్రామిక రంగం లో ఉపాధికి సంబంధించిన బిల్లును కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. స్థానికులకే పెద్ద పీట వేయడం ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేటు , ఉమ్మడి సంస్థల్లో స్థానికులకు ఉపాధి కల్పించడంలో ప్రాధాన్యం ఇవ్వాలి.
కొత్త పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే స్థానికతను నిర్ణయించేందుకు రాష్ట్రం, జిల్లా, జోన్‌ల వారీగా నిర్ణయించాలని బిల్లులో పేర్కొన్నారు. అంతే కాదు చట్టం పకడ్బందీగా అమలయ్యేందుకు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఏపీ సర్కార్ ఆల్రెడీ అమలు చేస్తున్న విధానాన్ని మరో రాష్ట్రం ఇప్పుడు చేపట్టడం చర్చకు దారి తీసింది. కరోనా విషయంలోనూ జగన్ ఆలోచనలు…తర్వాత కాలంలో మిగిలిన వారందరూ అందిపుచ్చుకోవడాన్ని చూశాం.