విశాఖ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటేనే ఫైర్ బ్రాండ్. అటువంటి ఆయన్ని కదిలించి చూస్తే మరింతగా రెచ్చిపోతారన్నది తెలిసిందే. ఇదిలా ఉండగా నర్శీపట్నంలో ఓ డాక్టర్ రాజకీయ అవతారం ఎత్తి ఏకంగా వైసీపీ సర్కార్ మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ డాక్టర్ వెనక అయ్యన్న ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ ఘాటైన ఆరోపణలు చేశారు.
దీని మీద గట్టిగానే రియాక్ట్ అయిన అయ్యన్న తన పై ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటున్నారు. అంతే కాదు, రుజువు చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి ఉమా శంకర్ రాజీనామా చేయాలని ప్రతి సవాల్ చేశారు. దీని మీదనే ఇపుడు ఓ లెక్కన సెటైర్లు పడుతున్నాయి. అయ్యన్న రాజకీయ జీవితాన్ని గత ఎన్నికల్లోనే ప్రజలు తేల్చేసి ఇంటికి పంపించారని, ఇక వేరేగా రాజకీయ సన్యాసం చేయాల్సినది ఏముంటుందని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే తనకు గత మూడు దశాబ్దాలుగా తన పొలిటికల్ కెరీర్ కి తోడు నీడగా ఉన్న సొంత సోదరుడు నర్శీపట్నం మునిసిపాలిటీ మాజీ వైఎస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు మీద కూడా అయ్యన్న దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. తమ్ముడిని నమ్ముకునే తాను ఇలా అయిపోయానన్ని అయ్యన్న తాపీగా చింతిస్తున్నారు. అటువంటి సోదరుడు విభీషణుడుగా మారి తన రాజకీయ ఓటమికి కారణమయ్యాడని కూడా నిట్టూరుస్తున్నారు.
తన సోదరుడుని వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ నమ్ముకుంటే ఆయనకు కూడా ఇదే గతి తప్పదని హెచ్చరిస్తున్నారు కూడా. తన తమ్ముడిని నమ్మితే వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా సీసీ కెమేరాలు పెట్టి మరీ బ్లాక్ మెయిల్ చేయగల సమర్ధుడు అని అన్నయ్య అయ్యన్న బ్యాడ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి ఇన్నాళ్ళూ తమ్మున్ని పక్కన ఉంచుకుని అయ్యన్న చేసిన రాజకీయం అంతా చెడ్డగానే ఉందా అన్నది చెప్పాలని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి అయ్యన్న ఇపుడు కుటుంబ బంధాలు కూడా దాటేసి ముదురు రాజకీయానికి తెర తీశారంటున్నారు.