ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం

నెల రోజులకు పైగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఎట్టకేలకు కోర్టు నుంచి కీలక ఆదేశం వెలువడింది. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మధ్య సయోధ్య కుదరకపోవడంతో.. మధ్యేమార్గంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు…

నెల రోజులకు పైగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఎట్టకేలకు కోర్టు నుంచి కీలక ఆదేశం వెలువడింది. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మధ్య సయోధ్య కుదరకపోవడంతో.. మధ్యేమార్గంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు పేర్కొంది. 

ఇది నిజంగా ఆశాజనక తీర్పు. ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఇద్దరూ పట్టింపులకు పోతున్నారు. దీంతో చర్చల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. మళ్లీ చర్చలు మొదలుకావాలంటే హైకోర్టు చెప్పిన మార్గంలో వెళ్లాల్సిందే.

అయితే దీనిపై నేరుగా ఆదేశాలు జారీచేయలేదు హైకోర్టు. ప్రభుత్వం, కార్మిక సంఘాలు సమ్మతిస్తేనే కమిటీ  ఏర్పాటుచేసేలా ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. తమ అంగీకారాన్ని రేపటిలోగా చెప్పాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పందించిన తర్వాతే విచారణను కొనసాగిస్తామని స్పష్టంచేసింది. చర్చలకు అంగీకారం తెలపకపోతే.. ఆర్టీసీ విలీనం, సమ్మె, ఎస్మా ప్రయోగం, ఆదాయ-వ్యయాలు, బకాయిలు లాంటి అంశాలపై వాదించి ఉపయోగం లేదని కోర్టు అభిప్రాయపడింది.

హైకోర్టు ప్రతిపాదనకు అటు కార్మిక సంఘాలు, ఇటు కేసీఆర్ సర్కార్ ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. నేరుగా కార్మికులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా లేదు. 

అటు కార్మికులు కూడా గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ అధికారులతో చర్చించడానికి అంగీకరించడం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి

మరోవైపు అధిక చార్జీలు వసూలు చేస్తున్న కారణంగా, సమ్మెను చట్ట  వ్యతిరేకం అని చెప్పలేమని కోర్టు వ్యాఖ్యానించింది. అధిక చార్జీలు వసూలు చేసినట్టు భావిస్తే, వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించాలని సూచించింది. కేసును రేపటికి వాయిదావేసింది.