మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారం చివరికి మండలి రద్దు తీర్మానానికి దారి తీశాయి. మండలిలో టీడీపీ సభ్యుల బలం ఉండడంతో మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దును అడ్డుకునేందుకు నిబంధనలకు వ్యతిరేకంగా అనుసరించడం అధికార పక్షం వైసీపీకి కోపం తెప్పించింది.
దీంతో ఏకంగా మండలినే రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. మండలి రద్దు అంశం ఇప్పుడు మోడీ సర్కార్ కోర్టులో ఉంది. ఇదే సమయంలో మండలిని రద్దు చేయాలని అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారించింది. దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
మండలి రద్దుపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, దీనిపై న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వలేదని, ఈ రిట్లో తాము ఎలా జోక్యం చేసుకోగలమని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు పిటిషనర్ తరపు లాయర్ ఉన్నం మురళీధర్‌రావు స్పందిస్తూ పలు ప్రజాహిత ప్రయోజన అంశాలున్నందున విచారణ చేయాలని కోరారు. దీంతో దీనిపై విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.