సార్వత్రిక ఎన్నికల ముంగిట పులివెందులలో తన ఇంట్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురి కావడం తీవ్ర సంచలనం రేకెత్తించింది.
ఎందుకంటే వివేకానందరెడ్డి స్వయాన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తమ్ముడితో పాటు ఆ ఎన్నికల్లో సీఎం రేస్‌లో ఉన్న జగన్‌కు చిన్నాన్న కూడా. అందువల్లే వైఎస్ వివేకా హత్య కేసు రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
కేసు అనేక మలుపులు తిరుగుతూ చివరికి హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురిని సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో బుధవారం హైకోర్టు మరో ఆదేశం ఇచ్చింది. కేసుకు సంబంధించి రికార్డులను సీబీఐకి వెంటనే అందజేయాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది.
వివేకా హత్య కేసుకు సంబంధించి రికార్డులను అందజేయాలని పులివెందుల కోర్టులో మొదట సీబీఐ పిటిషన్ వేసింది. అయితే హైకోర్టు నుంచి తమకు అలాంటి ఆదేశాలేవీ రాలేదని మెజిస్ట్రేట్ చెప్పి, రికార్డులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో కేసు ముందుకు సాగాలంటే ఆ రికార్డులు అవసరమని సీబీఐ భావించింది.
ఈ నేపథ్యంలో తమకు పులివెందుల కోర్టు నుంచి వివేకా హత్య కేసుకు సంబంధించి రికార్డులను ఇప్పించాలని హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు తాజాగా రికార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.