తాము ఆదేశించని దాన్ని, ఆదేశించినట్టు తప్పుడు ప్రకటన చేయడం సరైంది కాదని పిటిషనర్‌పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆంధ్రజ్యోతిలో కథనం రావడం, దానిపై దర్యాప్తునకు ఆదేశించాలని విశాఖకు చెందిన న్యాయవాది నిమ్మి గ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
విచారణలో భాగంగా గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ దొనాడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ధర్మాసనం ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేశామని, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి అధికారి పేరు, ఇతర వివరాలు అందులో పొందుపరిచామన్నారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ వేయాలని తామెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం మంచిది కాదని సూచించింది.
అలాగే మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ పత్రికా కథనం ఆధారంగా ఆరోపణలు చేస్తే సరిపోదని పేర్కొంది. అంతేగాకుండా కథనం ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. పిటిషన్లో ఆ అధికారికి సంబంధించిన వివరాలతో కూడిన ప్రతిపాదనలు, అభ్యర్థనలు లేకుండా ప్రభుత్వాన్ని వివరణ కోరడం అసాధ్యమని ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది. పిటిషన్లో సవరణలకు అనుమతిస్తూ సెప్టెంబర్ 3కి విచారణను వాయిదా వేసింది.