ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి సంగం డెయిరీ న్యాయపరమైన దెబ్బ కొట్టింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను దెబ్బతీయాలని ఏపీ ప్రభుత్వం వేసిన ఎత్తులన్నీ న్యాయస్థానం ముందు చిత్తయ్యాయి. సింగిల్ బెంచే కాదు… తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్‌లో కూడా జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తప్పలేదు.
సంగం డెయిరీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం రిట్ అప్పీల్‌ను బుధవారం హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కొట్టివేసింది. అంతేకాదు, సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సంగం డెయిరీ యాజమాన్య హక్కులు మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసంది. సంగం డెయిరీ నిర్వహణ బాధ్యత తెనాలి సబ్ కలెక్టర్‌కు ప్రభుత్వం అప్పగించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ సంగం డెయిరీ యాజమాన్యం గతంలో హైకోర్టును ఆశ్రయించింది. సంగం డెయిరీలో ప్రభుత్వ జోక్యం తగదంటూ గతంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వ రిట్ అప్పీల్‌ను తాజాగా హైకోర్టు తిరస్కరించడం గమనార్హం.
హైకోర్టు తీర్పుతో సంగం డెయిరీలో ప్రభుత్వం జోక్యం చేసుకోడానికి లేకుండా పోయింది. సంగం డెయిరీని వదిలేస్తుందా? లేక మరో రూపంలో విరుచుకుపడుతుందా? అనేది కాలమే తేల్చాల్సి వుంది.