విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో తలపండినవారు. ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తారు. మొత్తానికి రాజకీయ సుఖ తీరాలకు చేరుకోవడమే ఆయన టార్గెట్ గా ఉంటుంది.
టీడీపీ నుంచి గెలిచినా కూడా గంటా మనసు మాత్రం కుదురుగా ఉండడం లేదని అంటున్నారు. ఆయన గత ఏడు నెలల కాలంలో చాలా సార్లు ఇలా తన అసంత్రుప్తిని బయటేసుకున్నారు కూడా. అయితే మీడియా అడిగే ప్రశ్నలు మాత్రం ఆయనకు పెద్ద చికాకుగా ఉన్నాయట.
తాను విశాఖ రాజధానికి ఎందుకు జై కొట్టానంటే అంటూ గంటా గట్టి వివరణే ఇస్తున్నారు. విశాఖ తనకు రాజకీయ జన్మ ఇచ్చిందని, ఈ ప్రాంతం బాగుపడే అవకాశం రాజధాని రూపంలో వస్తే తాను ఎలా కాదంటానంటూ లాజిక్ పాయింట్ లాగారు.
అది సరే కానీ పార్టీ ఫిరాయింపులు లాంటివి ఉంటాయా అంటే మాత్రం గంటాకు చిర్రెత్తుకొస్తోందిట. ఆయన తాను టీడీపీలో ఉంటానని ఒకటికి పది మార్లు బల్ల గుద్ది చెప్పుకొస్తున్నారు.తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు చెప్పిందే వేదం, ఒక్క విశాఖ రాజధాని తప్ప అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి బాబు గారు అమరావతి రాజధాని అంటున్నారు కదా, ఆ విధంగా పార్టీ లైన్ దాటారా మీరు అంటే మాత్రం గంటా గుస్సా అవుతున్నారు.
నెనెక్కడే పార్టీ లైన్ దాటాను, అమరావతి రాజధాని రైతులకు నా సానుభూతి ఉంది, వారికి సాయం చేయమని జగన్ సర్కార్ ని గట్టిగానే కోరుతున్నానని అంటున్నారు.మీడియా తన వాదనను అర్ధం చేసుకోకుండా ఏదో రాసేసి మరేదో అడిగిస్తే చికాకు కాదా అంటున్నారు గంటా వారు. ఇక విశాఖ రాజధాని వరకూ ఒకే కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ కట్టు తప్పుతుందన్న బాధ కూడా గంటాకు ఉందట.
ఆ విషయమో వైసీపీ సర్కార్ క్లారిటీ ఇవ్వాలంట. ఇక్కడ ప్రశాంత జీవితానికి ఇబ్బంది కలగకుండా చూడాలట. మొత్తం మీద గంటాకు రాజకీయ జన్మ ఇచ్చిన విశాఖ ఇష్టం. అంతకంటే ముందు టికెట్ ఇచ్చి రాజకీయ జన్మ ఇచ్చిన టీడీపీ కంటే కూడా విశాఖ ఇష్టం.ఇలా రాసుకున్నా కూడా అయనకు ఇబ్బందిగా ఉంటుందేమో మరి. మొత్తానికి గంటా పాలిట్రిక్స్ ఎవరికీ అర్ధం కావని అంటున్నారు.