ఒలింపిక్స్ లో భారత బృందం లో మెరుపుల కన్నా, రిక్త హస్తాలతో వెనుదిరగడమే ఎక్కువగా ఉంది. గతంలో కన్నా ఎక్కువ మంది అథ్లెట్లతో ఒలింపిక్స్ కు హాజరయినప్పటికీ, తొలి రోజే రజతంతో బోణీ చేసినప్పటికీ.. ఈ సారి పతకాల సంఖ్య మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో నమోదు కావడం లేదు.
పతకాలు ఆశలు పెట్టుకున్న వివిధ విభాగాల్లో భారత అథ్లెట్లు నిరాశనే మిగులుస్తున్నారు. ఇంకా కొన్ని పతకాలపై ఆశలు మిగిలే ఉన్నప్పటికీ, ఇప్పటికే కొన్ని విభాగాల్లో చేతులెత్తేసిన వైనాన్ని గమనిస్తే, ఈ సారి మరీ ఆశలు పెట్టుకోనక్కర్లేదు అనుకోవాల్సి వస్తోంది.
పతకాల ఆశలో నిలిచిన టెబుల్ టెన్నిస్, పురుషుల బ్యాడ్మింటన్, షూటింగ్ లలో భారత బృందం నిరాశ పరిచింది. టెబుల్ టెన్నిస్ లో మూడో రౌండ్ వరకూ వెళ్లి శరత్ కమల్ ఆశలు రేపాడు. అయితే ప్రయోజనం దక్కలేదు. ఇక షూటింగ్ లో గతంలో భారత్ తరఫున అద్భుతాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సారి షూటర్లు గురి తప్పారు.
వివిధ అంతర్జాతీయ ఛాంపియన్షిప్ లలో భారత షూటర్లు మెరుగైన ప్రదర్శనను ఇచ్చినా, ఒలింపిక్స్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. ఇక ఒకటీ రెండు పోటీల్లో మాత్రమే షూటర్లపై ఆశలున్నట్టున్నాయి. కేవలం సంచలనాల మీద ఆశలు పెట్టుకోవాల్సిందే కానీ, విశ్వాసం అయితే లేదు.
ఇక పురుషుల హాకీ టీమ్ ఆస్ట్రేలియాతో చిత్తు అయినా, స్పెయిన్ తో మ్యాచ్ లో కోలుకుంది. ఇంకా కొద్దో గొప్పో ఆశలున్నాయి. హాకీలో గనుక భారత జట్టు ఏదో ఒక పతకం గెలిచినా అది అద్భుతమే అవుతుంది. భారత హాకీకి అది పూర్వవైభవమే అవుతుంది. మరేం చేస్తారో చూడాల్సి ఉంది.
ప్రస్తుతం పీవీ సింధూ పోటీలో ఉంది. సింధూ కచ్చితంగా పతకం సాధించే అవకాశాలున్నాయనే ఆశలు పెట్టుకోవచ్చు. అలాగే గతంలో భారత్ కు పతకం వచ్చిన ఈవెంట్లలో బాక్సింగ్ ఉంది. ఈ సారి మహిళల బాక్సింగ్ లో ఒక పతకం మీద ఆశలు పెట్టుకోవచ్చు లాగుంది.
ఇక మొత్తంగా బాక్సింగ్ లో అలాంటి సంచనలనాలు ఏమైనా నమోదవుతాయేమో చూడాల్సి ఉంది. ఇక రెజ్లింగ్ లో కూడా గతంలో పతకాలున్నాయి, కాబట్టి.. మొత్తం ఈవెంట్లు పూర్తయ్యే సరికి కనీసం ఒక్కటైనా యాడ్ అవుతుందని ఆశించాలి. ఇప్పటి వరకూ బాగా నిరాశ పరిచిన విభాగం అయితే షూటింగ్, ఆర్చరీ. ఆర్చరీలో ఇంకా కొంత ఆశ మిగిలి ఉంది.