సాధారణ ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా కొన్నాళ్లపాటు మీడియాలో, జనంలో అది చర్చనీయాంశమవుతుంది. తలా ఒక అభిప్రాయం చెబుతుంటారు. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. విమర్శలు, ప్రశంసలు వినిపిస్తుంటాయి. అనుకున్నది ఒకటి… అయ్యింది మరొకటైందని ఆశ్చర్యపోతుంటారు. మీడియా మేధావులు అనేక రకాలుగా విశ్లేషణలు చేస్తుంటారు. ప్రస్తుతం ఇదే జరుగుతోంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంగతి అలా పక్కన పెడదాం. వాటికి మించిన ప్రాధాన్యం తెలంగాణలోని హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు ఉంది.
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ సూపర్ డూపర్ విజయం పైనే మాట్లాడుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యమైందని విస్మయపడుతున్నారు. టీఆర్‌ఎస్ గెలిచింది అంటే గెలిచిందని కాకుండా గతంలో ఎప్పుడూ రానంత మెజారిటీ ఈ చియోజకవర్గంలో రావడంతో ఇదొక చరిత్ర అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు చేతిలో ఓడిపోయిన సైది రెడ్డి ఈ ఎన్నికలో సాధించిన మెజారిటీ ఆయన కూడా ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే సీఎం కేసీఆర్ కూడా అనుకోలేదు.
రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ గెలవదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఒకవేళ గెలిచినా అది చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఉంటుందని, నామమాత్రపు గెలుపేనని భావించాయి. కాని తీరా ఫలితాలు వచ్చేసరికి ప్రతిపక్షాలు మూర్ఛపోయాయి. కొన్నాళ్లపాటు కోమాలోకి పోయినా పోవచ్చు. టీఆర్‌ఎస్, కేసీఆర్ పని అయిపోయిందని ప్రతిపక్షాలు పెద్దఎత్తున ప్రచారం చేసినప్పుడల్లా ఆ పార్టీ బంపర్‌గా గెలుస్తూవుంది. అవి అసెంబ్లీ ఎన్నికలు కావొచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావొచ్చు, పంచాయతీ ఎన్నికలు కావొచ్చు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమైనప్పటినుంచి వారి పట్ల కేసీఆర్ వైఖరి చూస్తూనే ఉన్నాం. ఆర్టీసీ కార్మికులను పురుగులను చూసినట్లు చూశారు. హుజూర్‌నగర్ విజయంతో అది ఇంకా ఎక్కువైంది. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారనే కొత్త కాన్సెప్టును తెరమీదికి తీసుకొచ్చారు. మొండి పట్టుదలతోనే ఉన్నారు. ఈ పట్టుదల హుజూర్‌నగర్ ఎన్నిక వరకు ఉంటుందని, అందులో ఓడిపోయినా, నామమాత్రంగా గెలిచినా దిగొస్తారని, సమ్మెను పరిష్కారం చేస్తారని ప్రతిపక్షాలు అనుకున్నాయి. కాని పీటముడి మరింత బిగుసుకోవడానికి ఘన విజయం దోహదం చేసింది.
ఉపఎన్నిక ఫలితాల తరువాత కేసీఆర్ సుదీర్ఘంగా నిర్వహించిన మీడియా సమావేశం ఆయన మొండి వైఖరిని మరింత స్పష్టంగా తెలియచేసింది. ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటినుంచే ఆయన కోర్టును ఖాతరు చేయడలేదు. ఇప్పుడు ఖాతరు చేయకపోవడం మరింత తారస్థాయికి చేరింది. 'కోర్టు ఏం చేస్తది? కొడ్తదా?' అన్నారంటేనే ఆయన వైఖరి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగింపంటే ఆర్టీసీ ముగింపేనని కుండబద్దలు కొట్టారు కేసీఆర్. ఆయన మీడియా సమావేశం తరువాత మాట్లాడిన ఆర్‌టీసీ నాయకులు ఆర్టీసీ కేసీఆర్ జాగీరు కాదని, ఎవరిది ముగింపో ప్రజలు నిర్ణయిస్తారని కయ్యానికి మరింతగా కాలు దువ్వారు.
ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యం ఏమిటంటే ఆర్‌టీసీ సమ్మె ప్రభావం హుజూర్‌నగర్ మీద ఎందుకు పడలేదనేది. ప్రతిపక్షాల ప్రచారమంతా ఆర్‌టీసీ సమ్మెను కేంద్రబిందువుగా చేసుకునే సాగింది. కేసీఆర్ పతనం హుజూర్‌నగర్ నుంచి ప్రారంభమవుతుందని రెచ్చిపోయాయి. బీజేపీ అయితే తాను ఇక అధికారంలోకి రావడమే మిగిలింది అన్నట్లుగా వ్యవహరించింది. కాని ఏమైంది? డిపాజిట్ కూడా దక్కలేదు. హుజూర్‌నగర్ జనం ఏం చూసి టీఆర్‌ఎస్‌ను గెలిపించారో కేసీఆర్ వ్యతిరేకులకు అర్థం కావడంలేదు. అన్ని పార్టీలు పోస్టుమార్టం మొదలుపెట్టాయి.
ఆర్‌టీసీ సమ్మె ఉవ్వెత్తున చెలరేగడం, సమ్మెను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోవడం, బంద్ జరగడం, ప్రతిపక్షాలు ఐక్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం, ప్రజల్లోనూ ఆర్‌టీసీ కార్మికుల పట్ల సానుభూతి ఉండటం… ఇలా అనేక పరిణామాలు ఉప ఎన్నికకు ఎక్కడలేని ప్రాధాన్యత కల్పించాయి. అసలు ఉపఎన్నిక ప్రకటించగానే టీఆర్‌ఎస్ దీన్ని మహా యుద్ధంలా చిత్రీకరించింది. అలాగే వ్యూహాలు పన్నింది కూడా. నిజానికి కేసీఆర్ కూడా భయపడ్డారు. అందుకే సీపీఐ మద్దతు తీసుకున్నారు.
కాని ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. కాంగ్రెసు పార్టీలో అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలోనే వాదవివాదాలు, లుకలుకలు బయలుదేరడంతో ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని అనుకున్నారు. కాని క్రమంగా రాష్ట్రంలో పరిస్థితి వేడెక్కింది. ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రం రణరంగమైంది. ఈ ప్రభావం హుజూర్‌నగర్‌లో తప్పనిసరిగా ఉంటుందనే భావన సర్వత్రా వ్యాపించింది. కాని ఏ ప్రభావమే లేకుండాపోయింది.