సందర్భాన్ని బట్టి టీడీపీ పొత్తులుంటాయట…!

ఏపీలో ఎన్నికలు చూస్తే సరిగ్గా నాలుగున్నరేళ్ళ దూరంలో ఉన్నాయి. ఇప్పటినుంచే పొత్తు పొడవనక్కరలేదు కానీ తొందరపడిన కమలం, జనసేన కోయిలలు ముందుగా కూసేశాయి. మరి సేఫ్ జోన్లో ఉందామనో లేక వైసీపీ తో ఢీ…

ఏపీలో ఎన్నికలు చూస్తే సరిగ్గా నాలుగున్నరేళ్ళ దూరంలో ఉన్నాయి. ఇప్పటినుంచే పొత్తు పొడవనక్కరలేదు కానీ తొందరపడిన కమలం, జనసేన కోయిలలు ముందుగా కూసేశాయి. మరి సేఫ్ జోన్లో ఉందామనో లేక వైసీపీ తో ఢీ కొట్టేందుకు కొత్త‌ బలం కోసమో బీజేపీతో జనసేనకు  పొత్తు అయితే కుదిరింది. ఇక  ఇపుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వంతుట.

తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్నట్లున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్న గారి వర్ధంతి వేళ ప్రత్యక్షమై ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ పటిష్టమైనదని చెప్పుకొచ్చారు. టీడీపీ సాటీ, పోటీ మరో పార్టీ లేనేలేదని కూడా తేల్చేశారు. 

జనసేనతో బీజీపీ పొత్తు పెట్టుకుంటే టీడీపీ భయపడేది లేదని గంటా అంటున్నారు. టీడీపీని ఢీ కొట్టడం కష్టమని కూడా గంటా చెప్పడం విశేషం. 

క్షేత్ర స్థాయిలో పటిష్టమైన క్యాడర్  ఉందని, అదే టీడీపీకి శ్రీరామరక్ష అని కూడా గంటా చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ సమయం, సందర్భం చూసి పొత్తులు పెట్టుకుంటుందని గంటా కాస్తా ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.

అంటే మళ్ళీ ఈ మూడు పార్టీలు కలుస్తాయన్న సంకేతాలు ఆయన మాటల ద్వారా ఇచ్చారనుకోవాలి. స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పిన గంటా తాను ఫక్త్ టీడీపీ నేతను, అన్న గారికి అసలైన తమ్ముణ్ణి  అని గట్టిగానే చెప్పుకున్నారు. 

మరి గంటా వరకూ చూసుకుంటే లేటేస్ట్ కామెంట్స్ తో ఆయన సైకిల్ పార్టీలోనే కొనసాగుతారని భావించవచ్చా. ఏమో రాజకీయాల్లో  ఎపుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు.