మహారాష్ట్రలో రాజకీయం రంజుగా మారింది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇది కాస్తా శ్రుతిమించింది. దీంతో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా పరోక్షంగా గవర్నర్ వాడిన పదజాలాన్ని తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గవర్నర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆత్మాభిమానం ఉంటే పదవి నుంచి దిగిపోవాలని శరద్ పవార్ కఠినంగా మాట్లాడారు. దీనంతటికి ఇటీవల ఆలయాలు తెరిచే విషయమై గవర్నర్ కోశ్యారీ పరిధికి మించి ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తీవ్ర పదజాలాన్ని వాడడమే కారణంగా చెప్పొచ్చు.
ముఖ్యమంత్రికి గవర్నర్ రాసిన లేఖలో …‘బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌లను తెరిచారు. కానీ దేవుళ్లను లాక్‌డౌన్‌లో ఉంచారు. ఇలా చేయమని భగవంతుడి నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా? లేదా మీరే అకస్మాత్తుగా లౌకికవాదిగా మారారా?’ అని సీఎం ఠాక్రేను గవర్నర్ హేళన చేస్తూ ప్రశ్నించారు.
గవర్నర్ లేఖపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ అలాంటి పదాల్ని ఎంచుకొని ఉండాల్సింది కాదు అని అభిప్రాయపడ్డారు. గవర్నర్ లేఖపై ముఖ్యమంత్రితో పాటు పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌పై శరద్ పవర్ ఏమన్నారంటే…
‘ఆత్మాభిమానం ఉన్న ఏ ఒక్కరూ ఆ పదవిలో కొనసాగరు. లేఖలో గవర్నర్ ఉపయోగించిన పదాలపై అమిత్‌షా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటప్పుడు ఆత్మాభిమానం ఉన్నవారు ఆ పదవిలో ఉండాలా.. లేదా.. అని ఆలోచించి నిర్ణయం తీసేసు కుంటారు’ అని పవార్ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో పవార్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. శివసేన కూటమికి గవర్నర్ విపరీత ధోరణులు ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టైంది. దీంతో ఇదే అకాశంగా తీసుకున్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అదును చూసుకుని గవర్నర్‌పై రెచ్చిపోతున్నాయి. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవ అంటే ఇదేనేమో!