సరిగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి సమయంలో… కోవిడ్ కేసుల విషయంలో ఇండియా కాస్త రిలాక్డ్స్ గా ఉండేది. అప్పటికి ఫస్ట్ వేవ్ పూర్తిగా ముగిసిందనే పరిస్థితి. అంతకు ముందు ఏడాది డిసెంబర్ నుంచినే ప్రజలు కోవిడ్ భయాందోళనల నుంచి కాస్త బయటకు వచ్చారు. డిసెంబర్, జనవరి నెలల్లో జనజీవనం రొటీన్ స్థితికి దాదాపు వచ్చింది. ఒక ఫిబ్రవరి నాటికి కరోనా భయాలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత మార్చి నుంచి కథ మారిందని వేరే చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు విశేషం ఏమిటంటే, సరిగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దేశంలో ఏ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయో, ఇప్పుడు అదే స్థితికి దిగి వచ్చాయి. సెకెండ్ వేవ్ విజృంభణకు నెల రోజుల ముందు ఎలాంటి పరిస్థితి ఉండేదో, ఇప్పుడు అలాంటి రిలాక్డ్స్ స్టేటస్ కు చేరింది దేశం. మరో మాటలో చెప్పాలంటే రెండో వేవ్ పూర్తిగా సద్దు మణుగుతున్నట్టే. మూడో వేవ్ ఉంటుందో, లేదో ఊహించలేం కానీ, సెకెండ్ వేవ్ మాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టింది.
గత వారం రోజుల వ్యవధిలో నమోదైన కరోనా కేసులు.. ఎనిమిది నెలల లోయెస్ట్ లెవల్ గా నిలుస్తోంది. అక్టోబర్ 11- 18ల మధ్యన నమోదైన కేసుల సంఖ్య, సరిగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి 22-28ల మధ్యన నమోదైన కేసుల సంఖ్యతో సమానంగా ఉంది.
మార్చి నెల నుంచి సెకెండ్ వేవ్ నంబర్లు పెరగసాగాయి, ఏప్రిల్ నెలకు పతాక స్థాయికి చేరాయి, మే లో భయపెట్టాయి.. ఆ తర్వాత తగ్గుముఖంలో కూడా ఆందోళనను కొనసాగించాయి. ఇప్పుడు సెకెండ్ వేవ్ కు ముందు పరిస్థితులు మళ్లీ వచ్చాయి. కరోనా కేసులకు సంబంధించి వారాంతపు లెక్కల ప్రకారం.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆ మహమ్మారి ప్రభావం దాదాపు తగ్గింది.
గత వారంలో కూడా నమోదైన కేసుల్లో మెజారిటీ వాటా కేరళలోనే. మిగతా దేశమంతా కలిసి 50 శాతం కేసులు నమోదైతే కేరళలో యాభైశాతం కేసులు వచ్చాయి. కేరళలో కూడా అంతకు ముందు వారంతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య గత వారంలో బాగా తగ్గింది. ఏతావాతా.. ఎనిమిది నెలలకు కరోనా సెకెండ్ వేవ్ నుంచి దాదాపు ఉపశమనం లభించినట్టుగా ఉంది.
భారీ ఎత్తున జరుగుతున్న వ్యాక్సినేషన్, చాలా మంది ఆల్రెడీ ఒకసారి సోకి ఉండటం.. వంటి కారణాల రీత్యా.. మూడో వేవ్ ప్రభావం తక్కువగా ఉండవచ్చనే అంచనాలు ఇది వరకే వచ్చాయి. అక్టోబర్ లో థర్డ్ వేవ్ ఉంటుంది జాగ్రత్త అనే పరిస్థితి నుంచి, అక్టోబర్ లో అన్నీ ఓపెన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇంతటితో కరోనా మహమ్మారి పీడ విరగడ అయితే అంతకన్నా భారతదేశానికి కావాల్సిందిప్పుడు మరోటి లేదు!