గాల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ముఖాముఖి పోరులో 20 మంది ఇండియన్ సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇండియన్ ఆర్మీ పూర్తి ప్రకటన జారీ చేసింది. చైనా సైన్యంతో జరిగిన ఈ ముఖాముఖి పోరులో మొత్తం 20 మంది సైనికులు మరణించడంతో పాటు ఇంకో 76 మంది సైనికులు గాయపడ్డారని ఆర్మీ ప్రకటించింది. వీరందరినీ వివిధ ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టుగా ఇండియన్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వారందరి పరిస్థితీ మెరుగ్గానే ఉందని, త్వరలోనే కోలుకుని వారు విధుల్లోకి చేరతారని ప్రకటించారు.
ఆ పోరులో చైనీ సైనికులు కూడా పలువురు మరణించారని భారత ఆర్మీ ప్రకటించింది. దాదాపు 40 మందికి పైగా చైనీ సైనికులు మరణించి ఉండవచ్చని అంచనా వేసింది. ఈ విషయమై అమెరికన్ నిఘా వర్గాలు కూడా దాదాపు అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి. 35 మంది వరకూ చైనీ సైనికులు మరణించారని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయట.
అయితే పలువురు భారత సైనికులను చైనా అదుపులోకి తీసుకుందనే ప్రచారం కూడా ఒకటి సాగింది. జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వచ్చాయి. గాయపడిన పలువురు భారత సైనికులను చైనా అదుపులోకి తీసుకుందని, తన ప్రాంతంలోకి తీసుకెళ్లిందని వార్తలు వచ్చాయి. అయితే భారత ఆర్మీ అదంతా తప్పుడు ప్రచారం అని ప్రకటించింది. భారత సైనికులు ఎవ్వరూ చైనా ఆధీనంలో లేరని, అలాంటి ప్రచారాలు చేయవద్దని ఆర్మీ స్పష్టం చేసింది. 20 మంది మరణించగా, 76 మంది గాయపడ్డారని.. చైనా ఆధీనంలో భారత సైనికులు లేరని ఆర్మీ ప్రకటించింది. తాము భారత సైనికులను అదుపులోకి తీసుకున్నట్టుగా చైనా కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.