మూడునెలల్లో రైల్వే ఆదాయానికి నాలుగు వేల రూపాయల గండి పడిందని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రైల్వే ఆదాయంలో భారీగా తగ్గుముఖం చోటు చేసుకుందని అధికారిక గణాంకాలే చెబుతూ ఉన్నాయి. మూడు నెలల్లో నాలుగు వేలకోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోవడం అంటే మాటలు కాదు.
భారతీయ రైల్వేలకు ప్రధానంగా సరకు రవాణా ద్వారానే ఆదాయం రావాలి. అందులోనే గండి పడినట్టుగా రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయినట్టుగా చెబుతూ ఉన్నాయి.
అయితే వర్షాకాలం కావడంతో.. రైలు ప్రయాణాలు మందకొడిగా సాగుతూ ఉండటం వల్ల ఈ ఆదాయం తగ్గిపోయిందా? లేక దేశీయంగా పరిశ్రమల్లో మాంద్యం వల్లనా ఆదాయం తగ్గిపోయిందా? అనే విషయాన్ని అధికారికంగా నిర్ధారించడం లేదు. వర్షాకాల ప్రభావం కొంత ఉండినా, మాంద్యం ప్రభావం కూడా ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ఏదేమైనా ఇప్పటికే దేశీయంగా వివిధ పరిశ్రమలో మందగమనాన్ని సూచిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే ఆదాయం మరీ ఈ స్థాయిలో తగ్గిపోవడం ఆందోళనకరమైన అంశంలా అగుపిస్తోంది. తదుపరి త్రైమాసికంలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావొచ్చు.