అమెరికాలో చదువుకుంటున్న మన దేశ విద్యార్థులకు ఊరట లభించింది. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ, ఎల్-1 వీసాల్లో చేసిన సంస్కరణలు భారత్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ఒక వైపు తమ దేశ ప్రయోజనాలు కాపాడుకుంటూనే మరోవైపు తమ దేశంలో చదువుకుంటున్న విదేశీ యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ అమెరికా ప్రభుత్వం బిల్లు రూపొందించింది. కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఆందోళన చెందుతున్న భారతీయులకు ఇదో శుభవార్తే.
‘హెచ్–1బీ, ఎల్–1 వీసా సంస్కరణల చట్టం’ పేరుతో ఈ బిల్లును ఆ దేశంలోని రెండు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం చట్ట సభల్లో ప్రవేశపెట్టింది. అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలున్న వారికి హెచ్–1బీ మంజూరులో ప్రాధాన్యతనిస్తారు. దీంతో పాటు ఉన్నత విద్య అభ్యసించిన వాళ్లు, అధిక వేతనాలకు పనిచేసే నైపుణ్యం ఉన్న వారికి వీసా మంజూరు చేసేలా సంస్కరణలు చేశారు.
అమెరికా చేసిన ఈ సంస్కరణల వల్ల ఆ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. అమెరికాలో చైనా తర్వాత మన దేశ విద్యార్థులే ఎక్కువ మంది చదువుతున్నారు. మన దేశానికి చెందిన 2 లక్షల మందికిపైగా విద్యార్థులు అమెరికాలో ప్రస్తుతం చదువుకుంటున్నారు.
ఈ బిల్లు ప్రకాకం అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్–1బీ, ఎల్–1 వీసాదారులతో భర్తీ చేయడంపై నిషేధం విధిస్తారు. హెచ్1బీ వీసాదారులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనుల్లోనూ, వారు పనిచేసే కార్యాలయాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు పడకుండా చర్యలు తీసుకుంటారు. 50 మందికంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కంపెనీల్లో సగం మంది వరకు హెచ్–1బీ లేదంటే ఎల్–1 వీసా వినియోగదారులు పని చేస్తుంటే అదనంగా హెచ్–1బీ వినియోగదారుల నియామకాలపై నిషేధం విధిస్తారు.