తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరుగా బాబుకు హ్యాండ్ ఇస్తున్నారు. పదవులకు రాజీనామా చేయనిదే పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి జగన్ తెగేసి చెబుతున్నప్పటికీ బాబు కింద ఉండేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపించడం లేదు. అలా ఇప్పటికే నలుగురు టీడీపీ నుంచి బయటపడగా.. మరికొంతమంది ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి ఎంతమంది టీడీపీని వీడుతారనే అంశంపై లేదు. మరో ఇద్దరు టీడీపీని వీడితే పరిస్థితి ఏంటనే అంశంపైనే ఉంది. మొన్నటి ఎన్నికల్లో 23 సీట్లు సాధించారు చంద్రబాబు. అలా గెలిచిన వాళ్లలో ఆల్రెడీ నలుగురు టీడీపీని వీడారు. అలా టీడీపీ కౌంట్ 19కి పడిపోయింది. మరో ఇద్దరు కనుక 'సైకిల్' దిగి, ఈ గట్టుకొస్తే.. టీడీపీ కౌంట్ 17కి పడిపోతుంది. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాకు ఎసరు వస్తుంది.
అవును.. టీడీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకొస్తే టెక్నికల్ గా బాబు ప్రతిపక్ష హోదా పోయినట్టే. అప్పుడిక బాబు కేవలం ఓ ఎమ్మెల్యే మాత్రమే. అందుకే “ఆ ఇద్దరు” ఎవరనే ఆసక్తి అందర్లో ఉంది.
“ఆ ఇద్దరు” లిస్ట్ లో గంటా శ్రీనివాసరావు పేరు ఎప్పట్నుంచో నలుగుతోంది. టెర్మ్స్ అండ్ కండిషన్స్ కుదిరితే ఏ క్షణానైనా ఆయన సైకిల్ దిగడం ఖాయం. గంటా జంప్ కొడితే ఒక్కరే వెళ్లరు.. ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే గణబాబు కూడా జంప్ అవ్వడం గ్యారెంటీ. అలా ఒకే దెబ్బకు టీడీపీ నుంచి 2 వికెట్లు పడతాయి.
అయితే వీళ్లిద్దరూ ప్రస్తుతానికి టీడీపీకే పరిమితమయ్యారని అనుకుందాం. మరి వీళ్లిద్దరి స్థానంలో వచ్చే “ఆ ఇద్దరు” ఎవరు? ఇక్కడ కూడా లిస్ట్ పెద్దదే కనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా.. దాదాపు మిగతా అన్ని జిల్లాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా 3 రాజధానులకు మద్దతుగా శ్రీకాకుళం, విశాఖ, ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి నెక్ట్స్ వికెట్ పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. తన పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్తున్నారు, రాబోయే రోజుల్లో ఎంతమంది పార్టీని వీడుతారనే అంశంపై చంద్రబాబుకు ఇప్పటికే ఓ అవగాహన ఉందని చెబుతున్నారు ఆ పార్టీ జనాలు. అలాంటి వాళ్లకు ఆల్రెడీ పార్టీలో ప్రాధాన్యం తగ్గించేశారట బాబు. పైగా తన ప్రతిపక్ష హోదా కూడా పోతుందని మానసికంగా ఆయన సిద్ధపడి ఉన్నారట.
కాకపోతే ఇదంతా అనధికారికంగానే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీని వీడిన ఎమ్మెల్యేలెవ్వరూ వైసీపీ కండువా కప్పుకోలేదు. అలా అని టీడీపీలో కూడా కొనసాగడానికి ఇష్టం చూపించడం లేదు. స్పీకర్ ఆల్రెడీ ఇలాంటి వాళ్లను ప్రత్యేకమైన బ్యాచ్ గా గుర్తించారు. సో.. టెక్నికల్ గా మాత్రమే బాబు ప్రతిపక్ష నాయకుడి హోదా పోతుంది. అయితే ఇప్పుడు కొత్తగా బాబు పరువు పోయేదేం లేదు. కేవలం 23 సీట్లు వచ్చినప్పుడే బాబు పరువు గంగలో కలిసిపోయింది. అంతా ఆయన స్వయంకృతాపరాధం.