రాజకీయ పార్టీలకు, అందులోనూ కొత్తగా పెట్టిన పార్టీలకు ఎన్నికలంటే ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. తమ సత్తా చూపించుకోడానికి, తమ ఉనికి చాటుకోడానికి ఎన్నికలకు మించిన అవకాశం పార్టీలకు, నాయకులకు ఇంకేమీ ఉండదు. అయితే తెలంగాణలో పురుడుపోసుకున్న వైఎస్సార్టీపీకి ఎన్నికలంటే పెద్ద ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదు. నిరుద్యోగ సమస్యలపై ధ్వజమెత్తి, నిరాహార దీక్షలతో జనంలో ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్న షర్మిల ఎన్నికల రణరంగంలో దిగేందుకు మాత్రం వెనకడుగేశారు.
రాజకీయాల్లోకి రావడంతోనే అందివచ్చిన ఓ ఉప ఎన్నికను స్కిప్ చేశారు షర్మిల. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తెగేసి చెప్పారు. ఇద్దరు వ్యక్తుల స్వార్థం కోసం వచ్చిన ఉప ఎన్నిక వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదంటూ పోటీనుంచి తప్పించుకున్నారు. ఈ లాజిక్ అయితే బాగానే ఉంది కానీ.. ఇప్పుడు చాలామంది.. షర్మిల పార్టీని, పవన్ స్థాపించిన జనసేనతో పోల్చడం మొదలుపెట్టారు.
ఏడేళ్ల క్రితం జనసేన ప్రస్థానం మొదలైనా.. ఇప్పటికీ ఆ పార్టీకి కనీసం ఓ ఎమ్మెల్యే కూడా లేరు. పొరపాటున ఓ ఎమ్మెల్యే గెలిచినా అతడిని కూడా నిలుపుకోలేని పరిస్థితి జనసేనానిది. అయితే ఈ ప్రస్థానానికి జనసేన అవలంబించిన రాజకీయ వ్యూహాలే కారణం.
ఆది నుంచి జనసేనది లూప్ లైనే..
పార్టీ పెట్టిన తొలిసారి వచ్చిన ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చి తాను సైలెంట్ అయ్యారు జనసేనాని. కనీసం తాను సపోర్ట్ చేసిన పార్టీలు అధికారంలోకి వచ్చినా మొహమాటానికిపోయి ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా తీసుకోలేదు.
ఇక రెండోసారి వచ్చిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బోల్తా పడ్డారు పవన్. ఈ రెండు ఎన్నికల్లో తాను గెలవాలనే కాంక్ష కంటే వైసీపీ ఓడిపోవాలనే కక్షే పవన్ లో ఎక్కువగా కనిపించింది. అది వేరే సంగతి.
ఆ తర్వాత తెలంగాణలో ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీకే మద్దతిచ్చారు. ప్రతి ఉప ఎన్నికనూ స్కిప్ చేసుకుంటూ వెళ్లేసరికి చివరికి పార్టీకి గుర్తు కూడా సమస్యగా మారిపోయింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన గాజు గ్లాసు గుర్తుని ఓ స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
షర్మిల మరో పవన్ కాకూడదు..
ఇప్పుడు షర్మిల కూడా అదే రూటు ఎంచుకుంటే తెలంగాణలో రాజకీయ మనుగడ కష్టమేనంటున్నారు విశ్లేషకులు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను బాయ్ కాట్ చేయడం షర్మిల పార్టీపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు సమ దూరం పాటిస్తున్నారు షర్మిల. నాలుగో ప్రత్యామ్నాయంగా తన సత్తా చూపిస్తానంటున్నారు.
ఈ దశలో కనీసం వైఎస్సార్టీపీకి తెలంగాణలో ఎంత పట్టు ఉందో తెలుసుకోడానికి హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో షర్మిల ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేదనే వాదన మొదలైంది. పోటీకి దిగితే.. విజయం వరించకపోయినా, ఇంకోసారైనా షర్మిలకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తారు. పవన్ మార్క్ రాజకీయం చేస్తామంటూ ఎన్నికలను వదిలేసుకుంటూ పోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
క్షేత్ర స్థాయిలో నిర్మాణం ఏది..?
జనసేనకు, వైఎస్సార్టీపీకి ఉన్న మరో ప్రధాన పోలిక రెండు పార్టీల్లో నెంబర్-2 లేకపోవడం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయకపోవడం. అయితే షర్మిలకు ఇంకా అవకాశాలున్నాయనుకోండి. పవన్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయలేదు, షర్మిల కూడా ఇంకా ఆ పని మొదలుపెట్టలేదు.
పవన్ పార్టీలో ఆయన తప్ప చెప్పుకోడానికి మరో నాయకుడు లేడు. షర్మిల పార్టీలో కూడా ప్రస్తుతానికి ఇలానే ఉంది పరిస్థితి. జనసేనానికి జనాల్లో క్రేజ్ ఉన్నా అది ఓట్ల రూపంలో మారలేదు. షర్మిలను కూడా వైఎస్ఆర్ కుమార్తెగా జనం బాగానే ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అయితే ఆ అభిమానమంతా ఓట్ల రూపంలో మారాలంటే మాత్రం ఆమె రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాల్సిందే.