గృహనిర్భంధం అవసరమే..బాబూ

ఛలో ఆత్మకూరు అన్నది గడచిన 100 రోజుల్లో ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చేసిన అతి పెద్ద వెంచర్. మిగిలిన వన్నీ చిన్నా చితక వ్యవహారాలే. Advertisement సరే, ఛలో ఆత్మకూరు సందర్భంగా ప్రభుత్వం పోలీసులను…

ఛలో ఆత్మకూరు అన్నది గడచిన 100 రోజుల్లో ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చేసిన అతి పెద్ద వెంచర్. మిగిలిన వన్నీ చిన్నా చితక వ్యవహారాలే.

సరే, ఛలో ఆత్మకూరు సందర్భంగా ప్రభుత్వం పోలీసులను గట్టిగా మోహరించింది. ఎక్కడిక్కడ ఉద్యమం అణచివేయాలని చూసింది. పాలనలో ఎవరు వున్నా చేసేది అదే.

విశాఖలో హోదా ఉద్యమాన్ని ఉక్కు పాదాలతో అణచి వేసారు ఇదే బాబుగారు అధికారంలో వున్నపుడు. విశాఖ విమానాశ్రయం రన్ వే మీద నుంచి లాంజ్ లో దాకా కూడా వెళ్లనివ్వలేదు అప్పటి ప్రతిపక్ష నేతను.

ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమాన్ని అతి బలవంతంగా అణచివేసారు. ముద్రగడ వుండే ఊరినే దాదాపు గా పోలీసులు స్వాధీనం చేసుకున్నంత పని చేసారు. ముద్రగడను పరామర్శించడానికి ఏ ప్రముఖలు వెళ్లినా రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి వెనక్కు పంపేసారు నిర్దాక్షిణ్యంగా.

ఇలా పోలీసులను వాడడం, ప్రతిపక్షాన్ని అణచడం అన్నదాంట్లో చంద్రబాబు ది అందెవేసిన చేయి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా వైకాపా ఇప్పుడు అదే పని చేస్తుంటే, చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కిందా మీదా అయిపోతున్నారు. ఇలాంటిది తామెప్పుడు కనలేదు, వినలేదు అన్నట్లు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.

బాబుగారు ఈ అమాయకత ఇంకా చాలా విషయాల్లో ప్రదర్శిస్తున్నారు. తమకు అనుకూలం కానీ మీడియాకు ప్రకటనలు తగ్గించడం లో, తమకు అనుకూలం కానీ చానెళ్లను ప్రయిమరీ బ్యాండ్ నుంచి వెనక్కు నెట్టడంలో చాలా స్మూత్ గా పనికానిచ్చారు అయిదేళ్ల పాటు. అంతెందుకు విలేజ్ ల్లో సాక్షి ఏజెంట్లను కూడా కట్టడి చేసిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు ఆంధ్రలో ఏబిఎన్ చానెల్ ను కట్టడి చేస్తుంటే, బాబుగారి చాలా ఆశ్చర్యంగా వుంది.

ఇలా బాబు గారు వాడిన అస్త్రాలే ఇప్పుడు వైకాపా వైపు నుంచి దూసుకువస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఛలో ఆత్మకూరు అంటూ పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో హింస పెరిగిపోతోందని, దారుణాలు జరిగిపోతున్నాయని, ఇలా అలా అంటూ. కానీ చిన్న అనుమానం, ఛలో శ్రీకాకుళం అనో, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, ఆఖరికి వైకాపాకు పట్టువున్న రాయలసీమ జిల్లాలు ఎక్కడా జరగని అలజడి ఒక్క పల్నాడు ఏరియాలోనే ఎందుకు జరుగుతోంది? ఎందుకు కనిపిస్తోంది? మిగిలిన ప్రాంతాలు అన్నీ ఎందుకు ప్రశాంతంగా వున్నాయి.

పైగా ఛలో ఆత్మకూరు కోసం వచ్చి హడావుడి చేసిన అచ్చెంనాయుడు, అఖిలప్రియ వగైరాలకు అసలు పల్నాడు గురించి ఏం తెలుసు. ఈ సందర్భంగా గృహనిర్భందాలు చేసారు. నిజానికి ఈ పని చంద్రబాబు చేయాలి. తన పార్టీ నాయకులను తనే గృహనిర్భంధం చేయాలి. లేదూ అంటే ఒక్కొక్కళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీ వెళ్లి, భాజపా తీర్ధం పుచ్చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద తలకాయలంతా ఇలా తెలుగుదేశం గూడు వదిలి వెళ్లిపోతే ఎలా? అందుకే బాబుగారు తమ నాయకులను గృహనిర్భంధం చేసుకోవాలి.లేదూ అంటే నాయకులు పార్టీలో మిగలరు.

అవును, ఈ పార్టీ మారే సంగతి అలావుంచితే, ఆదినారాయణ రెడ్డి ఏమిటి? ఢిల్లీలో అలా అన్నారు. వైకాపాను జగన్ ను నిలవరించడం, తట్టుకోవడం తేదేపా వల్ల కాదు, భాజపా అండ అవసరం. అందుకే ఆపార్టీలో చేరాను అని చెప్పారు కదా? అంటే జగన్ ను చంద్రబాబు నిలవరించలేరని ఆది నారాయణ రెడ్డి ఫిక్స్ అయిపోయారన్నమాట. పోతూ పోతూ ఇలా ఇజ్జత్ తీసే పనేంటో? అందుకే ఇలా వెళ్లిపోకుండా, వెళ్లిపోతూ మాటలు విసరకుండా, బాబు తమ పార్టీ నాయకులను గృహనిర్భంధం చేయాల్సిందే.

ఇప్పుడే అందుతున్న వార్త. ఈస్ట్ గోదావరి నుంచి వలసలు షురూ అయ్యాయట.

ఆర్వీ