ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతానికి ఏం చేయాలో ఆ పార్టీ నేతలకు దిక్కు తోచనట్టుంది. దీంతో బీజేపీ నేతలు జబర్దస్త్ కామెడీ షోను తలపించేలా తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేవాలయాల సందర్శన పేరుతో రెండు రోజులుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు చేస్తున్న విమర్శలకు జనాన్ని ఆలోచింపజేయడం, ఆకట్టుకోవడం పక్కన పెడితే… నవ్వులపాలు చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో దేవాలయాలను పడగొట్టారని, వాటిని నిర్మించాలని సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కేవలం 400 గజాల విస్తీర్ణంలో మాత్రమే హిందూ ఆలయాలను నిర్మిస్తున్నారని ఆయన విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే సీఎం జగన్ మౌనంగా ఎందుకు ఉంటున్నారని ఆయన ప్రశ్నించడం గమనార్హం. గోవధ చట్టాన్ని రద్దు చేయాలన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేయడం జబర్దస్త్ కామెడీకి మించిపోయిందంటే అతిశయోక్తి కాదు.
ప్రధానంగా బీజేపీ ఏపీలో బలోపేతం కాకపోవడానికి ప్రధాన కారణం … ప్రజల సమస్యలను ఎజెండాగా తీసుకోకుండా, తమ ఆలోచనలను వారిపై రుద్దాలని ప్రయత్నించే క్రమంలో అభాసుపాలవుతోంది. ఇప్పుడు ఆలయాల కంటే ఆస్పత్రుల నిర్మాణం ఎంతో ముఖ్యమని కరోనా మహమ్మారి హెచ్చరించినా… బీజేపీ నేతలకు కనువిప్పు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కరోనా పంజా విసిరిన సమయంలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుందామన్నా బెడ్, ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో లేని దుస్థితిని కళ్లారా చూశాం. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ఎజెండాతో జనంలోకి వెళ్లకుండా, గుడుల చుట్టూ తిరగడం వల్ల ఒన గూరే ప్రయోజనం ఏంటో ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాల్సి వుంది.
ప్రజానీకానికి ప్రధానంగా కావాల్సింది మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి. కేంద్రంలో తమ అధికారాన్ని ఉపయోగించి ఏపీ ప్రజలకు వాటిని కల్పించగలిగితే బీజేపీ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. అంతే తప్ప, ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు భిన్నంగా బీజేపీ నడుచుకుంటూ, ఎంత కాలమైనా ఏపీలో బలపడే అవకాశమే ఉండదని చెప్పక తప్పదు.