ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ సేమ్ టూ సేమ్. ఏ విషయంలో ఇద్దరూ ఒకేలా ఉన్నారు? ఇద్దరూ పరిపాలకులే. ఒకరేమో దేశ ప్రధాని. మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదే తేడా కదా. మరి ఏ విషయంలో ఒకే విధంగా ఉన్నారు ? ఆలోచనా విధానంలో అని చెప్పొచ్చు. ఎందుకో ఇద్దరూ ఒకే విధంగా ఆలోచిస్తున్నారు.
టీడీపీ హయాంలో జగన్ ఒక్క రాజధానికి అంటే అమరావతి నిర్మాణానికి అంగీకరించి, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ఆలోచన చేశారు. ఆలోచన చేయడమే కాకుండా దాని మీద వేగంగా చర్యలు తీసుకున్నారు. మూడు రాజధానులపై స్టడీ కోసం కమిటీలు వేయించారు. నివేదికలు తెప్పించారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయించారు. శాసన మండలిలో ఎదురు గాలి తగలడంతో ఏకంగా దాని రద్దుకు తీర్మానం చేశారు.
రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు అవసరమో అదేపనిగా మంత్రుల చేత ఊదరగొట్టించారు. అమరావతికి భూములిచ్చిన రైతులు ఏడొందల రోజులకు పైగా ఆందోళన చేసినా పట్టించుకోలేదు. కానీ చివరకు ఉన్నట్టుండి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. హై కోర్టుకు నివేదించారు. కానీ మూడు రాజధానుల ఆలోచన పూర్తిగా మానుకోలేదని, ప్రస్తుత బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి కాబట్టి, వాటిని సవరించి మళ్ళీ ప్రవేశపెడతామన్నారు.
మూడు రాజధానుల బిల్లును మరింత పకడ్బందీగా తయారు చేస్తామన్నారు. అది ఎప్పుడు ప్రవేశపెడతారో తెలియదు. ఇక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలపై ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలిసిందే. పార్లమెంటు ఆమోదించడంతో మూడు సాగు బిల్లులు చట్టాలయ్యాయి కూడా. కానీ రైతులు, ప్రతిపక్షాలు ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. పంజాబ్, ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా నిరంతరాయంగా ఆందోళన చేశారు. కానీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
కొందరు రైతులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల తరువాత సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఉపసంహరణ అనేది పూర్తిగా కాదు. సాగు చట్టాలను మరో రూపంలో ప్రవేశపెడతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. నల్ల చట్టాలంటూ ప్రతిపక్షాలు వ్యతిరేకించిన ఈ చట్టాలే భవిష్యత్తులో మళ్ళీ అమల్లోకి వస్తాయని చెప్పారు. తాము కేవలం ఒక్క అడుగే వెనక్కి వేశామని చెప్పారు.
కారణాలు ఏమైనప్పటికీ ఏపీలో జగన్, కేంద్రంలో మోదీ మూడు రాజధానుల విషయంలో, సాగు చట్టాల విషయంలో వెనక్కి తగ్గినట్లే తగ్గి తమ ఆలోచనలు అలాగే ఉన్నాయని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనుకున్న పనులు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బిల్లుల్లో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ప్రవేశ పెడితే ప్రజా వ్యతిరేకత రాదని చెప్పగలమా ? కానీ ప్రజావ్యతిరేకత వచ్చినా ఎదుర్కొంటామనే నమ్మకం పాలకులకు ఉన్నట్లుంది. ప్రజలను ఒప్పిస్తామనే విశ్వాసం ఉన్నట్లుంది. చూద్దాం …ఏమౌతుందో !