కరోనా రెండో దశ ముగిసిందో లేదో తెలియదు కానీ జనం విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఆంధ్రలో బార్ లు తెరచుకున్నాయి. థియేటర్లు తెరచుకున్నాయి. స్కూళ్లు తెరచుకున్నాయి. ఉదయం ఆరు నుంచి రాత్రి 11 వరకు జనం విచ్చల విడిగా తిరగొచ్చు.
రాజకీయ సభలు జరుగుతూనే వున్నాయి. జయంతులు, వర్థంతులకు అడ్డంకులేమీ లేవు. పెళ్లిళ్లు అయితే వందల మందితో జరిగాయి నిన్న మొన్నటి వరకు. ఏ అడ్డంకులు లేవు.
కానీ. వినాయకచవితి పందిళ్లకు మాత్రం అనుమతి లేదు. ఎక్కడా వినాయక చవితి పందిళ్లు వేయరాదు. నిమజ్జనాలు తీయరాదు. ఎవరి ఇళ్లలో వాళ్లు విగ్రహాలు పెట్టుకోండి.. ఇవీ ప్రభుత్వ నిబంధనలు.
ఎంత వరకు సబబు? అసలే జగన్ మీద, ఆంధ్ర ప్రభుత్వం మీద హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం సదా జరుగుతూనే వుంది. మరి ఇలాంటి నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి? వివిధ మతాల వారం వారం సామూహిక ప్రార్థనలు ఆపేసారా? లేదుగా? మరి వినాయకచవితి పందిళ్లకు ఏమొచ్చె? కావాలంటే కొన్ని నిబంధనలు పెట్టి అనుమతించవచ్చు కదా?
ఇప్పటికే వినాయకచవితి బ్యాంకు సెలవు తీసేసి నిరసన ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇది. ఇవన్నీ చూస్తుంటే జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని చేస్తున ప్రచారాలకు మరింత బలం చేకూర్చేలా వున్నాయి తప్ప. తగ్గించేలా కాదు.