జగన్‌ దారిలో ముళ్లు, రాళ్లు, తిమింగలాలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లా కలెక్టర్‌ల సమావేశం నిర్వహించిన తీరు, ఆయన మాట్లాడిన వైనం అన్నిటిని గమనించిన తర్వాత ఆయన మాటలలో ఒక నిజాయితీ కనిపించింది. ఒక నిబద్ధత ఉన్నట్లు తేలింది. అందువల్లే ఆయన…

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లా కలెక్టర్‌ల సమావేశం నిర్వహించిన తీరు, ఆయన మాట్లాడిన వైనం అన్నిటిని గమనించిన తర్వాత ఆయన మాటలలో ఒక నిజాయితీ కనిపించింది. ఒక నిబద్ధత ఉన్నట్లు తేలింది. అందువల్లే ఆయన ప్రజావేదిక నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇవ్వగలిగారు. ప్రభుత్వాలే అక్రమాలకు పాల్పడితే, అక్రమ నిర్మాణాలు చేపడితే, చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే ప్రజలకు మనం ఇస్తున్న సందేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు. ఎమ్మెల్యేలకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తూనే వారు ఏమైనా చట్ట విరుద్ధమైన పనులు అడిగినా చేయవద్దని నిర్ధిష్టంగా ఐఏఎస్‌ అధికారులకు మొహమాటం లేకుండా చెప్పారు. ఇది అభినందించదగ్గ విషయం.

ప్రభుత్వ ఆదేశాలను రహస్యంగా ఉంచవలసిన అవసరం లేదని, పై నుంచి కింది వరకు ఎక్కడా అవినీతి లేకుండా చేయాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఏమి జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్‌ల సమావేశంలో మాట్లాడుతూ మా వాళ్లు అడిగిన పనులు చేయాలని చెబితే అంతా ఆశ్చర్యపోవలసి వచ్చింది. ఇదేమిటి ఆయన ఇలా మాట్లాడుతున్నారేమిటి? ఇప్పుడు జగన్‌ మాటలు కూడా విని ఆశ్చర్యం కలిగి ఉంటుంది. కాకపోతే ఒక తేడా ఏమిటంటే జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి అని అన్న అభిప్రాయం కలుగుతుంది. ఎంత తేడా!

నలభై ఏళ్ల అనుభవం అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు తెలుగుదేశం వారికే పనులు జరగాలని అధికారులకు ఆదేశాలు ఇస్తే, పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికైనా అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందాల్సిందేనని ముఖ్యమంత్రిగా ఇంకా ముప్పైరోజుల అనుభవం లేని జగన్‌ చెప్పారు. అంటే దీని అర్థం ఏమిటి? ఒక నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడు ఇలా చేయగలరు. ఎంత సీనియర్‌ అన్నది ముఖ్యంకాదు. ఎంత అనుభవం ఉందన్నది ముఖ్యంకాదు.. ఎంత సిన్సియర్‌ అన్నది ముఖ్యం. నిబద్ధత, విధానాల పట్ల, ప్రజలకు మేలుచేయడం పట్ట ఎంత స్పష్టత ఉందన్నది ముఖ్యం.

ప్రజావేదిక నిర్మాణాన్ని అక్రమంగా అధికారంలో ఉన్నప్పుడు చేపట్టడమే కాకుండా, దానిని తనకు ఇవ్వాలని అధికారం పోయిన తర్వాత కూడా చంద్రబాబు అడిగారు. అదే జగన్‌ అధికారం లేనప్పుడే చట్టబద్ధంగా సొంత ఇల్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలకు పాల్పడితే మరి సామాన్యుల సంగతి ఏమిటని జగన్‌ ప్రశ్నించగలిగారు. అక్రమ నిర్మాణం కాబట్టి కూల్చుతున్నారు. కాని ఎనిమిది కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. మరి దీనిని ఎవరి నుంచి వసూలు చేస్తారన్న ప్రశ్న వస్తుంది. ఇలా అక్రమ నిర్మాణానికి బాధ్యులై ప్రజల డబ్బు వధా చేసిన వారిపై చర్యలు తీసుకోకుండానే వదిలివేస్తారా అన్నది కూడా చర్చనీయాంశమే.

అంతేకాదు.. ప్రజాసంకల్ప పాదయాత్రలో జగన్‌ చెప్పినట్లుగానే సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రాంతం, కులం, మతం, పార్టీల వంటివి చూడవద్దని చెప్పడం ఎవరైనా స్వాగతించాలి. పారదర్శకతకు పెద్ద పీట వేయాలని, జిల్లా కలెక్టర్‌లు ప్రజలను చిరునవ్వుతో పలకరించాలని చెప్పిన తీరుబాగుంది. తన మ్యానిపెస్టోని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దాని కాపీలను కలెక్టర్‌లు, సెక్రటరీలు, మంత్రులందరి వద్ద ఉండాలని చెప్పి జగన్‌ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఈ డెబ్బై ఏళ్ల భారతావనిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా ఎన్నికల మ్యానిపెస్టోని అధికారులకు ఇచ్చి దానిని అమలు చేయాల్సిందేనని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అనిచెప్పాలి.

ఇది ఒకరకంగా సాహసోపేతమైన నిర్ణయం. ప్రజలలో ఒక విశ్వాసం పెంచడానికి ఇది ఉపకరిస్తుంది. గతంలో గంటల, గంటల ఉపన్యాసాలు, చంద్రబాబే నిరంతరం మాట్లాడడం, స్వోత్కర్ష, పరనింద వంటివి వినివిని విసుగువచ్చేది. కాని జగన్‌ మాత్రం అలాంటి సుత్తిలేకుండా చెప్పదలచుకున్నది అంతాకలిపి గంటలో పూర్తిచేసి ఇవ్వవలసిన డైరెక్షన్‌ ఇచ్చేశారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ప్రభుత్వంలో జిల్లా అధికారులను, ఇతర ఉద్యోగులను మాత్రమే జవాబుదారి అని చెప్పకుండా తనను కూడా వారిలో కలుపుకుని అంతా బాధ్యతగా ఉండాల్సిందేని చెప్పడం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరం ప్రజాసేవకులమే అని తేల్చిచెప్పారు.

ఎమ్మెల్యేలు చెప్పే చట్టవిరుద్ధమైన పనులు చేయవద్దని చెప్పడానికి ఇప్పుడు ఉన్న వ్యవస్థలో చాలా సాహసం ఉండాలి. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఇది నచ్చని అంశం అవుతుంది. అందులోను టీడీపీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా, నియోజకకవర్గాలకు మహారాజులుగా వ్యవహరించిన తీరుచూశాక మనం కూడా అలాగే ఉందామనుకునేవారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోనూ బాగానే ఉంటారు. కాని అలాంటివారికి జగన్‌ అవకాశం ఇవ్వదలచుకోలేదని అనుకోవాలి. దీని పర్యవసనాలు కూడా కొన్ని ఉండవచ్చు. అయినా వాటిని జగన్‌ భరించడానికి సిద్ధంగా ఉన్నారని అనుకోవాలి.

ఎందుకంటే ఈ రోజులలో అధికారులు నిజాయితీగా ఉంటే వారిని ఎలా బదనాం చేసి మనపనులు చేయించుకోవాలనుకునే నేతలు ఎక్కువగానే ఉంటారు. జగన్‌ చెబుతున్నట్లు చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో వారిని తట్టుకోవడం అంత తేలికకాదు. మొత్తంమీద చూస్తే జిల్లా అధికారులకే కాదు. ఏపీలో రాజకీయ వ్యవస్థకు, అందులో భాగస్వాములవుతున్న వారికి జగన్‌ ఒక స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఆ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కొత్త మార్గంలోకి తీసుకువెళితే, పరిపాలనలో కొత్త పుంతలు తొక్కితే అది దేశానికే ఆదర్శవంతం అవుతుంది.

అయితే ఇది కేవలం జగన్‌ ప్రసంగంతోనే అయిపోదు. దీనికి ఎంతో కష్టపడాలి. ఈ రహదారిలో ఎన్నో ముళ్లు, రాళ్లు ఉంటాయి. విషసర్పాలు, తిమింగలాలు ఉంటాయి. వాటి భారిన పడకుండా జాగ్రత్తగా మెసలుతూ ముందుకు సాగవలసి ఉంటుంది. అయితే జగన్‌ చిత్తశుద్ధితో చెబుతున్న ఈ మాటలను స్వాగతించి అధికార యంత్రాంగం అంతా ఆయనకు సహకరిస్తుందని ఆశిద్ధాం.
-కొమ్మినేని శ్రీనివాసరావు

సమ్మర్‌కి బంపర్‌ బిగినింగ్‌! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌!